Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు నిందితుల అరెస్టు
- 34 తుపాకులు, 140 రౌండ్స్, 34 నకిలీ గన్ లైసెన్స్ స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆల్ఇండియా పర్మిట్‌తో నకిలీ గన్ లైసెన్స్ తయారు చేసి, వాటి ద్వారా అసలైన తుపాకులను సమకూర్చి ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఘరానా ముఠాలోని ఏడుగురిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 34 తుపాకులు, 140 రౌండ్స్, 34 నకిలీ గన్ లైసెన్స్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జమ్ము కాశ్మీర్‌లోని రాజోరి జిల్లాకు చెందిన అల్తాఫ్ హుస్సేన్ 2013లో జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి వెస్ట్ మారేడ్‌పల్లిలోని గ్రేస్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ సర్వీస్‌లో పనిలో చేరాడు. అనంతరం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఎస్ఐఎస్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్స్లో గన్‌మెన్‌గా విధుల్లో చేరాడు. ఈ సమయంలోనే తన స్వస్థలం రాజోరీకి వెళ్లి అక్కడ మేజిస్ట్రేట్ కార్యాలయంలో కొందరికి లంచాలిచ్చి నకిలీ గన్ లైసెన్స్‌ను సంపాదించాడు. ఆ లైసెన్స్‌తోనే అసలైన తుపాకీ తీసుకొని తిరిగి నగరానికి వచ్చాడు. ఆ నకిలీ లైసెన్స్‌ను ఎవరూ గుర్తించలేదు. దాంతో తానే స్వయంగా నకిలీ ఆయుధ లైసెన్స్‌లు తయారు చేయడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌కు చెందిన హఫీజుద్దీన్ అనే ఒక స్టాంప్ వెండర్‌ను తన మోసాల్లో భాగస్వామిని చేసుకుని నకిలీ స్టాంప్‌లు, ప్రభుత్వ కార్యాలయాల సీల్ తయారు చేశారు. అలాగే గ్రేస్ సెక్యూరిటీ సర్వీసెస్, రిజినల్ మేనేజర్ వెంకట కొండారెడ్డి, వెస్ట్‌మారేడ్‌పల్లిలో ఉన్న జిరాక్స్ షాప్ యజమాని ఐ.శ్రీనివాస్‌తో కలిపి ఒక ముఠాగా ఏర్పడ్డారు. సెక్యూరిటీ గార్డులుగా పనిచేయాలనుకునే జమ్మూ కశ్మీర్‌కు చెందిన యువకులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి నకిలీ స్టాంప్‌లను ఉపయోగించి వారికి నకిలీ ఆయుధాల సర్టిఫికేట్‌ను ఆల్ ఇండియా పర్మిట్‌తో అందించి రూ. 20 వేల నుంచి రూ. 60 వేల వరకు వసూలు చేసేవారు. ఆ లైసెన్స్‌లు తీసుకొని మహారాష్ట్రలోని పుణే, నాగాపూర్‌కు వెళ్లి అక్కడ ఆయుధాలు విక్రయించే దుకాణాల్లో అసలైన ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు. అలా కొనుగోలు చేసిన ఆయుధాలతో తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన వారికి ఏషియన్ సెక్యూరిటీ సర్వీసెస్, నందమూరి సెక్యూరిటీ అండ్ సర్వీసెస్, గ్రేస్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్‌ల్లో సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటున్నారు. వారిని వీవీఐపీ, జ్యువెలరీ షోరూమ్స్, ఏటీఎం, వ్యక్తిగత సెక్యూరిటీగా నియమించుకుంటున్నారు.
నాలుగేండ్లుగా దందా
దాదాపు నాలుగేండ్లుగా ఈ దందా సాగుతున్నది. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ డీసీపీ(ఓఎస్డీ) రాధకిషన్‌రావు ఆధ్వర్యంలో ఈ లైసెన్స్‌ల వ్యవహారంపైవిచారణ జరిపారు. జమ్మూ కశ్మీర్లో రాజోరి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం పేరుతో జారీ అయిన నకిలీ సర్టిఫికెట్లపై అక్కడ కార్యాలయంలో ఆరా తీయడంతో, అవన్నీ నకిలీవని అక్కడి అధికారులు తేల్చారు. దాంతో ఈ నకిలీ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులైన అల్తాఫ్ ఉస్సేన్, హఫీజుద్దీన్, వెంకట కొండారెడ్డి, శ్రీనివాస్‌తో పాటు నియామకాలు జరుపుకుంటున్న మూడు సెక్యూరిటీ ఏజెన్సీల నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 30 సింగిల్ బోర్, 3 డబుల్ బోర్ తుపాకులతో పాటు ఒక రివాల్వర్, 140 రౌండ్లు, 34 నకిలీ ఆయుధా లైసెన్స్ బుక్స్, రబ్బర్ స్టాంప్‌లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గన్ లైసెన్స్‌లు జారీ చేయడం, రెన్యూవల్ చేసేది పోలీస్ శాఖ అని సీపీ తెలిపారు. ఇలాంటి నకిలీ లైసెన్స్‌లో తుపాకులను కలిగి ఉండటం ప్రజా భద్రతకు ముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముఠా గుట్టును రట్టుచేయడంలో కీలకంగా వ్యవహరించిన వెస్ట్‌జోన్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాష్, ఎస్ఐలు రంజిత్‌కుమార్, మల్లిఖార్జున్, ఎండీ ముజఫర్ అలీ, చంద్రమౌళి తదితర సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.