Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలపై పోరాటాలకు సిద్ధం కండి :భద్రాద్రిలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు
నవతెలంగాణ-భద్రాచలం
సంపద సృష్టికర్తలు కార్మికులేనని, కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సామాన్య ప్రజానీకాన్ని కలుపుకొని సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ మూడో మహాసభ భద్రాచలం పట్టణంలోని సమ్మక్క-సారక్క ఫంక్షన్ హాల్లో (సున్నం రాజయ్య నగర్, చల్లా వెంకన్న ప్రాంగణంలో) గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులపై దాడి తీవ్రం చేసిందని, అదే స్థాయిలో కార్మిక వర్గం ప్రతిఘటనోద్యమాలు పెరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న అన్ని పోరాటాలను సమన్వయపరిచి సంఘటితం చేయాలని అన్నారు. మహాసభకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్, ఆహ్వాన సంఘం చీఫ్ పాట్రిన్, ప్రముఖ వ్యాపారవేత్త దేశప్ప, బాధ్యులు ఎంబి నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.