Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెయ్యి స్తంభాల గుడి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ప్రదర్శన
- హన్మకొండలో ప్రతినిధుల సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(టీఎండబ్ల్యూఈయూ) నాలుగో మహాసభలు హన్మకొండలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి రెండు రోజుల పాటు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో హన్మకొండ చౌరస్తా, మహాసభల ప్రాంగణాన్ని ఎర్రతోరణాలతో అలంకరించారు. శుక్రవారం ఉదయం 11:00 గంటలకు నగరంలోని వెయ్యి స్తంభాల గుడి దగ్గర నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వేల మంది మున్సిపల్ కార్మికులు భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. ప్రత్యేకంగా మూడు వేల మంది మహిళా కార్మికులు ఎర్రచీరలతో ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. బహిరంగ సభలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జనగాం రాజమల్లు, జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జె.వెంకటేశ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ, టీఎండబ్ల్యూఈయూ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ వి.నాగమణి, ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు జున్ను ప్రకాశ్, పి.సుధాకర్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.ప్రభాకర్‌రెడ్డి, రాగుల రమేశ్, జీడబ్ల్యూఎంసీ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బరపట్ల మహేశ్, టి.ఉప్పలయ్య, తదితరులు పాల్గొననున్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మహాసభ అనంతరం హన్మకొండ చౌరస్తాలోని అమృత ఫంక్షన్‌హాల్(కామ్రేడ్ కందుకూరి లాలునగర్)లో ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. ఈ మహాసభల్లో భవిష్యత్ పోరాటాలకు సంబంధించిన కార్యాచరణ రూపొందించుకోనున్నారు. ఉద్యోగులందరికీ పీఆర్సీ వర్తింపజేసిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల విషయంలో మాత్రం అన్యాయం చేసింది. పీఆర్సీ చైర్మెన్ బిస్వాల్ సిఫారసుల ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు పెంచాల్సి ఉండగా వీరి విషయంలో తొక్కిపెట్టింది. కమిటీ సూచనలకు విరుద్ధంగా గుండుగుత్తగా రూ.15,600 వేతనాన్ని నిర్ణయించింది. ఈ విషయంపై మున్సిపల్ కార్మికులు కొట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచి వేతనాలు పెంచుకోవడం ఎలా అనే దానిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. 8 గంటల పనివిధానం, రాత్రిపూట పనిచేసే కార్మికుల రక్షణకు ప్రత్యేక చర్యలు, వారంతపు సెలవు, పండుగలకు వేతనంతో కూడిన సెలవుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలా కొట్లాడి విజయం సాధించాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని కార్మికులకు కనీస వేతనం రూ.24 వేలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనిపై మహాసభ దృష్టిసారించనున్నది. అదే సమయంలో రాంకీ లాంటి ప్రయివేటు సంస్థలకు చెత్త సేకరణ ఒప్పందాలను కట్టబెట్టి కార్మికుల పొట్టగొడుతున్న పాలకులు విధానాలను ఎలా అడ్డుకోవాలనే దానిపైనా చర్చించే అవకాశముంది. మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలనీ, మున్సిపల్ కార్మికులు నూటికి 90 శాతానికిపైగా షెడ్యూల్డ్ తరగతుల వారే ఉన్నారు కాబట్టి వారందరికీ దళిత బంధు వర్తింపజేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నది. దీనిపై మహాసభలో ప్రత్యేకంగా చర్చించనున్నారు.