Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 లక్షల మంది కార్మికులతో ఢిల్లీ ముట్టడి
- మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 4వ మహాసభలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు పిలుపు
- హన్మకొండ జిల్లా కేంద్రంలో భారీ మహాప్రదర్శన
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు పి. సాయిబాబు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్‌గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 4వ మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ప్రదర్శన, బహిరంగసభ నిర్వహించారు. యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనగామ రాజమల్లు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో సాయిబాబు పాల్గొని మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని 5 లక్షల మంది కార్మికులతో త్వరలో ఢిల్లీని ముట్టడించనున్నట్టు తెలిపారు. శ్రమజీవులు, కార్మికుల మాట వినకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఘోరీ కడతామని హెచ్చరించారు. కాలానికి ముందే పరిగెత్తే మున్సిపల్ కార్మికుల హక్కులను పరిరక్షించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలను గ్రేడ్లు, అవార్డుల కోసం అమలు చేస్తూ మున్సిపల్ కార్మికుల శ్రమను దోచుకుంటుందని ఆరోపించారు. బ్రిటీషు ప్రభుత్వంపై పోరాడి సాధించుకున్న 8 గంటల పనివిధానంతో పాటు పలు హక్కులను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ 4 కార్మిక కోడ్లుగా విభజించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు 'అగ్నివీర్' వంటి పథకాలతో సైన్యంలోనూ బీజేపీ ప్రభుత్వం ప్రయివేటీకరణ ప్రారంభించిందన్నారు. రైల్వేలు, విమానాలు, బొగ్గు గనులు లాంఇ ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్న మోడీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్మికులకు పనిభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులకు కనీసవేతనాలతో పాటు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దేశాన్ని అమ్మేస్తున్నారు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ప్రధాని మోదీ, అమిత్‌షా దేశాన్ని సంపన్నులు అంబానీలు, అదానీలకు అమ్ముతున్నారని ఎమ్మెల్సీ ఎ. నర్సిరెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ నినాదాలు చెబుతున్నారని, వేతనాలు, సౌకర్యాలు లేకుండా సబ్ కా వికాస్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే పలు బొగ్గు గనులను ప్రయివేటీకరణ చేశారని, పలు ప్రభుత్వ రంగ సంస్థలను సైతం అమ్మేశారని విమర్శించారు. స్థూల ఆర్ధికాభివృద్ధి అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందని చెబుతున్న సర్కార్ మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో పెండింగ్ సమస్యల సాధనకు పోరాటం చేయాల న్నారు. మీ డిమాండ్లను సత్వరమే పరిష్క రించేలా శాసన మండలిలో కృషి చేస్తానని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. రమ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని, కనీస వేతనంతో పాటు పలు కార్మిక చట్టాల అమలుపై మహా సభల్లో చర్చించి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బహిరంగసభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్, మున్సిపల్ ఉద్యోగుల సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి. ఉప్పలయ్య, రాగుల రమేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల చక్రపాణి, జి. ప్రభాకర్‌రెడ్డి రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
మనం సఫాయిలం కాదు.. సిపాయిలం : పాలడుగు భాస్కర్
తామూ సఫాయిలం కాదని, సిపాయిలమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ స్పష్టంచేశారు. రెండేండ్ల కిందట కరోనా నేపథ్యంలో కన్నబిడ్డలు కూడా తల్లిదండ్రులను పట్టుకోలేదని, అలాంటి సందర్భంలో అనాధ శవాలను మున్సిపల్ కార్మికులే ప్రాణాలకు తెగించి ఖననం చేశారని గుర్తుచేశారు. ప్రాణాలు పోతాయని తెలిసీ తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. మున్సిపల్ కార్మికులకు ఆదివారాలుండవు, సెలవులుండవు, నిత్యం పనిచేస్తూనే ఉంటారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని సీఎం ప్రకటించారని, కానీ ఇప్పటికీ అమలుచేయలేదని విమర్శించారు. 2014, 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, రూ.26 వేలు కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికులకు రూ.21 వేల కనీస వేతనం చెల్లిస్తున్నారని గుర్తు చేశారు.