Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 35 మంది విద్యార్థులకు అస్వస్థత
- ప్రయివేటు నర్సింగ్ హోంకు తరలింపు
- కళాశాలలో గ్యాస్ లీక్ కాలేదంటున్న యాజమాన్యం
నవతెలంగాణ కంటోన్మెంట్
విషవాయువుకు పీల్చడంతో హైదరాబాద్ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలో 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రయివేటు నర్సింగ్ హోంకు తరలించారు. అయితే, కళాశాలలో ఎలాంటి గ్యాస్ లీక్ జరగలేదని యాజమాన్యం చెబుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం మధ్యాహ్నం కళాశాల ప్రాంగణంలో కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దాంతో దారిన వెళ్లేవారు కొందరు గమనించి విద్యార్థులను అడగ్గా.. కళాశాలలో గ్యాస్ లీక్ అయిందని చెప్పారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అక్కడకు భారీగా చేరుకున్నారు. అస్వస్థతకు గురైన 35 మంది విద్యార్థులను కళాశాల అధ్యాపకులు సమీపంలోని గీత నర్సింగ్ హోంమ్, చెన్నై నర్సింగ్ హోంకు తరలించారు. వైద్యులు వారికి ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. విషవాయువు పీల్చడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెబుతున్నారు. అయితే, కళాశాల యాజమాన్యం మాత్రం అసలు తమ దగ్గర కెమికల్ కానీ, గ్యాస్ కానీ లీక్ కాలేదని చెబుతోంది. బయట ఉన్న చెత్త కుప్పలో నుంచి విషవాయువు వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు అందరూ కోలుకుని ఇండ్లకు వెళ్లిపోయారని కళాశాల సొసైటీ సభ్యులు చెప్పారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలను నిర్వహిస్తున్నారు.
విద్యార్థులకు ఎమ్మెల్యే పరామర్శ
గీతా నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే సాయన్న, కార్పొరేటర్ కొంతం దీపిక, వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పరామర్శించారు.