Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిచ్చి వేషాలు వేస్తే మెత్తగతంతాం...కొట్టి చంపుతాం
- వాడో చీప్ ఫెలో...:ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
- ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు తెలంగాణ ప్రజలు క్షమించాలి...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. వాడో సభ్యత, సంస్కారం లేని మనిషి. పిచ్చి వేషాలు వేస్తే మెత్తగ తంతాం...కొట్టి చంపుతాం. రాజకీయం చెరు...వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకొనేది లేదు. వాడో బురద... రాయి వేస్తే చింది మనమీదే పడుతుందని ఇన్నాళ్లు ఓపిక పట్టాం. అంతేకాని, ఆయనో పెద్ద తురుం అని భయపడి కాదు. ఎవర్ని పడితే వాళ్లను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించం. సీఎం కేసీఆర్‌ను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మౌనంగా ఉన్నామంటే సంస్కారం అడ్డొచ్చి మాత్రమే. మీకు లాగా మాకూ తిట్లు వచ్చు అనే విషయం మర్చిపోతే, గుర్తుచేస్తాం'' బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఫైర్ అయిన తీరు ఇది. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆపార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో ఫోన్లో మాట్లాడిందంటూ అర్వింద్ చేసిన ఆరోపణలపై ఆమె ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో మహిళలకు ఆదర్శంగా నిలవాలనీ, తనను చూసి మరో నలుగురు మహిళలు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో తాను సంయమనం పాటిస్తున్నాననీ, దాన్ని చేతకానితనంగా భావించి, నోటికొచ్చినట్టు మాట్లాడితే తప్పనిసరై ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తున్నదన్నారు. తాను బాధతో ఇలాంటి భాష వాడాల్సి వస్తున్నదనీ. తెలంగాణ ప్రజలు క్షమించాలనీ కోరారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో శుక్రవారంనాడామె ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, మాగంటి గోపీనాధ్, జీవన్‌రెడ్డి తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ అర్వింద్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. అర్వింద్ ఎక్కడపోటీ చేసినా, తాను స్వయంగా వెళ్లి అతన్ని ఓడించేందుకు పనిచేస్తానని చెప్పారు. కనీసం మహిళ అనే ఇంగితం కూడా లేకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఎందుకు సహించాలని అన్నారు. తాను ఏపార్టీపై విమర్శలు చేసినా, విధానపరంగానే మాట్లాడతాననీ, వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడబోననీ చెప్పారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానంటూ దొంగ బాండు పేపర్లు ఇచ్చిన ధర్మపురి అర్వింద్‌పై పసుపు రైతులు 420 కేసులు నమోదు చేస్తారని తెలిపారు. రాష్ట్రానికీ, నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు ఏమీ లేవనీ, కేవలం యాక్సిడెంటల్‌గా మాత్రమే ఆయన ఎంపీగా గెలిచారని చెప్పారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవర్ని పడితే వాళ్లను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం చేయాలో తమకూ తెలుసన్నారు. మల్లిఖార్జున ఖర్గే పార్లమెంటులో సీనియర్ నాయకుడనీ, తాను ఎంపీగా ఉన్నప్పుడు అనేక విషయాలపై చర్చించుకొనేవారమని చెప్పారు. అతని గురించి భవిష్యత్‌లో తాను మాట్లాడబోనన్నారు. ఆయన్ని గెలిపించుకోవడం నిజామాబాద్ ప్రజలు చేసుకున్న ఖర్మ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది ఆయనే అని ప్రతి విమర్శ చేశారు. రాజస్థాన్‌లో చదివినట్టు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడనీ, దీనిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాననీ చెప్పారు.
దమ్ముంటే నాపై పోటీచేసి గెలవాలి..
- ఎమ్మెల్సీ కవితకు ఎంపీ అరవింద్ సవాల్
నవతెలంగాణ-నిజామాబాద్‌సిటీ
దమ్ముంటే తనపై ఎంపీగా పోటీచేసి గెలవాలని ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లా డుతూ.. తాను లేని సమయంలో హైదరాబాద్‌లో తన ఇంటిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన ఇంట్లో 70 ఏండ్ల్ల తల్లి 75 ఏండ్ల తండ్రి ఉన్నారని, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడిచేయడంతో ఇంట్లో ఉన్న మహిళలు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. కిటికీలు, అద్దాలు, కారు అద్దాలు, దేవుడి పటాలు ధ్వంసం చేయడం ఏం సంస్కృతి అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ముగ్గురు కుల అహంకారంతో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ వాళ్ళతో టచ్‌లో ఉందో లేదో ఆమెనే తేల్చుకోవాలని, కాంగ్రెస్ వాళ్లకు కవిత ఫోన్ చేసినట్టు తనకు సమాచారం ఉందని తెలిపారు. అందరి ఫోన్లు ట్రాప్ చేసే ప్రభుత్వం కవిత ఫోన్ కూడా వింటే అసలు విషయం తెలుస్తుందన్నారు. కవిత తనపై పోటీకి సిద్ధమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీలో కవిత రాజకీయ భవితవ్యంపై అభద్రాతాభావంతో ఉన్నారని ఆరోపించారు. పార్టీలో సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప విపక్షాలపై నిందలు వేయవద్దని అరవింద్ హితవు పలికారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని స్పష్టంచేశారు.