Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ-20.. పర్యావరణ సదస్సుల్లో మోడీ విఫలం
- అంతర్జాతీయ వేదికలపై గొప్పలు మినహా ప్రయోజనం శూన్యం
- గుజరాత్ ఎన్నికల కోసమే తెరపైకి కామన్ సివిల్ కోడ్
- ఈసీ చర్యలు అభ్యంతరకరం:సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
- గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర : విజయ రాఘవన్
- ప్లాన్ ప్రకారం రెచ్చగొడుతున్న బీజేపీ : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల ఇండోనేషియా రాజధాని బాలిలో నిర్వహించిన జీ-20 సదస్సులో భారత్ అద్భుత విజయాలు సాధించిందంటూ ప్రధాని మోడీతోపాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. అయితే జీ-20 సదస్సుతోపాటు అంతర్జాతీయ పర్యావరణ సదస్సులోనూ మనదేశానికి అనుకూలంగా ఫలితాలు తీసుకు రావటంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు. సంపన్న దేశాలు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోవటమనేది మనకు ప్రతికూలంగా మారిందని వాపోయారు. వాటిని తట్టుకోవాలంటే మనం వడ్డీ రేట్లనన్నా పెంచాలి.. లేదంటే సంక్షేమ పథకాలకు కత్తెరైనా వేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సు ద్వారా సంపన్న దేశాలు తమ వడ్డీ రేట్లను తగ్గించుకునేలా వాటిపై ఒత్తిడి తేవటంలో మోడీ విఫలమయ్యారని విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పరిశ్రమలను నియంత్రించి, కాలుష్యాన్ని తగ్గించే బాధ్యత సంపన్న దేశాలపైన్నే ఉందని అన్నారు. ఈ విషయంలో కూడా ఆయా దేశాలపై మోడీ ఒత్తిడి తీసుకు రాలేకపోయారని తెలిపారు. భారతీయ మూలాలున్న రిషీ సునాక్ ఇంగ్లాండ్‌కు ప్రధాని అయినప్పటికీ... వలసదారుల పట్ల ఆయన వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు. ఇంతకుముందున్న దానికి భిన్నమైన వైఖరిని తీసుకోలేరని వివరించారు.
రెండు రోజులపాటు కొనసాగే సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఏ.విజయ రాఘవన్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి రాఘవులు మాట్లాడారు. త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న గుజరాత్లో అభివృద్ధి నినాదం పక్కకు పోయిందని ఆయన తెలిపారు. దాని స్థానంలో కామన్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరసత్వం), ఉచితాలను సంక్షేమ పథకాలుగా ప్రచారం చేయటమనేది ముందుకొచ్చాయని వివరించారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు... సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తాయి..? అందుకు సంబంధించి ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాయి..? వాటికి నిధులెక్కడి నుంచి వస్తాయంటూ ఎన్నికల సంఘం (ఈసీ) కూడా ప్రశ్నించటం శోచనీయమని అన్నారు. దాని చర్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. పాలక పార్టీ (బీజేపీ) ఈసీని కూడా ఈ రకంగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. ఇలాంటి చర్యలు, విధానాలు ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయ రాఘవన్ మాట్లాడుతూ... దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, తద్వారా ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్న వైనాన్ని వివరించారు. అలాంటి పప్పులుడకని చోట గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించి ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకు రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులు, అధికారాలు సంక్రమిస్తాయని తెలిపారు. వాటిని గవర్నర్లు తమ అధీనంలోకి తీసుకోవటం దారుణమని వ్యాఖ్యానించారు. వారు రోజువారీ పరిపాలనా వ్యవహారాల్లో తలదూర్చటం శోచనీయమని అన్నారు. కేరళ, తమిళనాడుతోపాటు ఇప్పుడు తెలంగాణలో సైతం ఇదే తతంగం నడుస్తోందని హెచ్చరించారు అందువల్ల అలాంటి గవర్నర్లను రీకాల్ (వెనక్కు పిలవటం) చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట... వాటిని చీల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకున్న ఆర్థిక స్వావలంబనకు తీరని విఘాతం కలుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యంగా పోరాడాలని విజయ రాఘవన్ పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో సీపీఐ (ఎం) అగ్రభాగాన నిలబడుతుందని చెప్పారు.
తమ్మినేని మాట్లాడుతూ... మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడటం సంతోషదాయకమని తెలిపారు. ఆ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అనేక ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించామని అన్నారు. వాటిలో పోడు భూముల సమస్య ముఖ్యమైందని తెలిపారు. మూణ్నెల్లలోగా ఆయా భూములకు పట్టాలిస్తామంటూ సీఎం ఇటీవల హామీనివ్వటం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే 40, 50 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలంటూ అడిగిన వారిపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం... ఆయా సాగుదార్లందరూ పట్టాలకు అర్హులని తెలిపారు. వారందరికీ సత్వరమే పట్టాలివ్వాలని కోరారు. షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలను సవరించాలనీ, 1998, 2008 డీఎస్సీల్లో సెలక్షన్ అయిన వారికి వెంటనే పోస్టులివ్వాలనీ, భార్యాభర్తలకు సంబంధించిన బదిలీల (స్పౌజ్ కేసులు) సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలని కోరారు. ధరణిలో నెలకొన్న ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడులో బీజేపీ ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో దాని ప్రమాదం పొంచే ఉందని హెచ్చరించారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాడుతున్నది కాబట్టే... ఒక ప్లాన్ ప్రకారం గులాబీ పార్టీ నేతలపై విమర్శలు, దుర్భాషలకు పాల్పడుతున్నదని విమర్శించారు. అయితే అదే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షాలు, ఇతర అభ్యుదయ శక్తులను, నేతలను రాష్ట్ర పోలీసులు అరెస్టులు చేయటం, గృహ నిర్బంధాలకు పాల్పడటం శోచనీయమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, పొత్తులు, సీట్లకు సంబంధించి ఇప్పటి వరకూ తమ పార్టీలో ఎలాంటి చర్చా జరగలేదని తమ్మినేని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.