Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ2 హాస్టల్ మెస్ ప్రారంభించాలని విద్యార్థుల డిమాండ్
- విద్యార్థి కాలికి తీవ్ర గాయం
- ఆగ్రహంతో వీసీ చాంబర్లోకి దూసుకెళ్లిన విద్యార్థులు
- మెస్ ప్రారంభించకపోతే మంత్రుల పర్యటనను అడ్డుకుంటాం : విద్యార్దులు
నవతెలంగాణ - ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కొంత కాలంగా ఈ2 మెస్ ప్రారంభించాలంటూ విద్యార్థులు చేస్తున్న విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్‌ను కలిసేందుకు వారు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది పరిపాలనా భవనం గేట్లు మూసివేశారు. విద్యార్థులు ఎంత కోరినా సిబ్బంది గేట్లు తీయలేదు. దాంతో విద్యార్థులు ఆగ్రహంతో గేట్లపై నుంచి దూకి లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి కాలికి తీవ్ర గాయమైంది. భద్రతా సిబ్బంది పరిపాలనా భవనంలోని గ్రిల్ గేట్లకు తాళం వేశారు. దాంతో మరింత ఆగ్రహించిన విద్యార్థులు ఆ తాళాన్ని బద్దలు కొట్టి లోపలికి పరిగెత్తారు. వీసీ పేషీ బయట ఉన్న అద్దపు ద్వారాలు మూసి ఉండటంతో విద్యార్థులు ఒక్కసారిగా తోయడంతో అవి ధ్వంసమయ్యాయి. అనంతరం విద్యార్థులు వీసీ పేషీలో బైటాయించి తక్షణమే వీసీ రావాలని డిమాండ్ చేశారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. మెస్ ప్రారంభించాలంటూ తాము ఎన్నో రోజులుగా వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. వీసీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి మండ ప్రవీణ్‌పై వీసీ ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది దాడిచేసి గాయపరిచారని ఆరోపించారు. విద్యార్థికి గాయమైనా వర్సిటీ ఉన్నతాధికారులు ఎవరూ కనీసం పరామర్శించలేదన్నారు. మెస్ ప్రారంభించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే, వర్సిటీలో నూతన బార్సు హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు శనివారం రానున్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అడ్డుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఓయూ అధికా రులు స్పందించారు. ప్రతి విద్యార్థికీ (సెల్ఫ్ ఫైనాన్స్ మినహాయించి) హాస్టల్, మెస్ వసతి అందించేం దుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కొద్దిమంది విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
మొదటి సంవత్సరం పూర్తైన పీజీ విద్యార్థులు రెండో ఏడాది కోసం హాస్టల్, మెస్ రెన్యువల్ చేసుకోవాలని, కానీ ఇప్పటి వరకు 134 మంది విద్యార్థులకుగాను 52 మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారని చెప్పారు. రెన్యువల్ చేసుకున్న విద్యార్థులకు మెస్, వసతి కోసం సరయూ హాస్టల్ కేటాయించినప్పటికీ ఈ2 హాస్టల్ ఖాళీ చేయడం లేదన్నారు. అలాగే, విద్యార్థుల పేరుతో ఈ2 హాస్టల్ గదుల్లో బయటి వ్యక్తులు ఉంటు న్నారన్నారు. అధికార యంత్రాంగం దీనిపై విద్యా ర్థులతో చర్చించగా.. దాదాపు విద్యార్థులంతా నిబం ధనల ప్రకారం నడుచుకుంటామని చెప్పారన్నారు. కేవలం 20 మంది విద్యార్థులు మాత్రం ఈ విష యాన్ని సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. శుక్రవారం ఆందోళనలో ఓ విద్యార్థికి గేట్ చువ్వలు తగిలి గాయపడ్డాడని తెలిపారు. అక్కడ సెక్యురిటీ సిబ్బందిగాని, పోలీసులుగాని ఎవరిపైనా చేయి చేసుకోలేదన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ హాస్టల్, మెస్ వసతి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని విద్యార్థి లోకం నమ్మొద్దని ఓయూ అధికారులు ప్రకటనలో కోరారు.