Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ నేతల హెచ్చరికలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని టీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు హెచ్చరించారు. శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన విలేకరుల సమావేశాల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి, ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జల కాంతం, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు మాట్లాడారు. అర్వింద్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన ఎమ్మెల్సీ కవితను రెచ్చగొడుతున్నారనీ, ఇలాంటి వికృత చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కవిత కనీసం స్పైసీ బోర్డును తెచ్చారనీ, అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని దొంగ బాండు పేపర్లు రాసిచ్చి, ఏం తెచ్చారని ప్రశ్నించారు. కవితను కించపరిస్తే జాగృతి, ప్రజాసంఘాలు ఊరుకోబోవని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలతో నిత్యం సంబంధాలు పెట్టుకొని గోడమీది పిల్లిగా అర్వింద్ వ్యవహరిస్తున్నారనీ, ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాననే భయం పట్టుకున్నదని విమర్శించారు. ఆయన తీరు పట్ల తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందన్నారు.