Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయిల్‌పామ్‌కు రాయితీలు: కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలతో పాటు ధాన్యం ఉత్పత్తి పెరిగిందనీ, ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్‌లో ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) అధ్యక్షులు సుధాకర్ రావు దేశారు అధ్యక్షతన వెజ్ ఆయిల్, ఆయిల్ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేస్తూ...... రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనలేమంటూ కేంద్రం చేతులెత్తేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించినట్టు తెలిపారు. ఈ క్రమంలో ఆయిన్ పామ్ సాగుకు రాయితీలు కల్పించేందుకు నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో వంట నూనెల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామనీ, అవరమైన రాయితీలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సాగు ప్రారంభమైందని తెలిపారు. పామాయిల్ తో పాటు వేరుశనగ, పొద్దు తిరుగుడు, సోయాబిన్ వంటి పంటలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో సోయాబిన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేరు శనగ, ఇతర జిల్లాల్లో పొద్దు తిరుగుడు పంటను పండిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. సుధాకర్ రావు దేశారు మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి దిగుమతులను తగ్గించడం, మన దేశంలో ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తయిన ఆయిల్‌కు సరైన ధర వచ్చేలా చూడటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విధానాల రూపకల్పనలు తదితరాంశాలపై సదస్సులో చర్చిస్తామని వివరించారు. రష్యా - యుక్రెయిన్ యుద్ధ వాతావరణ ప్రభావం పడినప్పటికీ ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల నుంచి దిగుమతులు రావడంతో తాత్కాలికంగా ఇబ్బందులను అధిగమించగలిగామని తెలిపారు. అయితే ఆయిల్ విషయంలో భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా భారతదేశంలోనే ఉత్పత్తికి గల అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో ఐవీపీఏ ఉపాధ్యక్షులు హేమంత్ బన్సల్, విపిన్ గుప్తతో పాటు వివిధ దేశాల నుంచి ఆయిల్ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.