Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌసింగ్ సొసైటీపై సీబీఐ విచారణ జరిపించాలి : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ-గండిపేట్
రంగారెడ్డి జిల్లా మణికొండలోని చిత్రపురి కాలనీ అక్రమాల పుట్టగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. శుక్రవారం మణికొండ మున్సిపాలిటీలోని చిత్రపురి కాలనీలో స్థానిక సీపీఐ నాయకులు, స్థానికులతో కలిసి ఆయన పర్యటించారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిత్రపురి కాలనీలో దాదాపు రూ. 300 కోట్ల వరకు అవినీతి జరిగిందన్నారు. అక్రమాల పుట్టగా మారిన హౌసింగ్ సొసైటీపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కో-ఆపరేటివ్ సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం దారుణమన్నారు. సినిమా పరిశ్రమతో సంబంధం లేని వారికి సొసైటీలో సభ్యత్వాలు కల్పించడంతో పాటు సొసైటీలో ప్లాట్లు, విల్లాలు, కేటాయించారని ఆరోపిం చారు. సొసైటీ భూములను తాకట్టు పెట్టి అడ్డగోలుగా విక్రయించారని, అడ్వాన్స్‌ల పేరుతో కమీషన్లు దండుకున్నారని తెలిపారు. సినీ కార్మికుల ఫిర్యాదు మేరకు సొసైటీలో జరుగుతున్న అక్రమాలను తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. లే అవుట్లకు అనుమతి లేకుండా ఇండ్లు నిర్మించడం సరికాదన్నారు. కోర్టు తీర్పులను ధిక్కరించి వాటిలో వర్కు చేయడం నేరమన్నారు. అక్రమాలకు గండిపేట, మణికొండ మున్సిపల్ అధికారులే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఐ తరపున పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సినీరంగ ప్రముఖులు మద్దిలేని రమేష్, రాష్ట్ర నాయకులు పుస్తకాల నర్సింగ్‌రావు, ఓరుగంటి యాదయ్య, పర్వతాలు, సయ్యద్ ఆఫ్సర్, రామస్వామి, కస్తూరి శ్రీనివాస్, సిద్దు, నర్సింహా, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.