Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెన్కో, ట్రాన్స్‌కోలను డిస్కంలతో ముడిపెట్టొద్దు
- రుణాలపై ఆ ప్రభావం పడుతుంది
- ప్రభుత్వ గ్యారెంటీ షరతు వద్దు
- డిస్కంల ఆర్ధిక పరిస్థితి మెరుగుదలకు తోడ్పడండి
- భోపాల్ పీఎఫ్సీ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ అధికారుల ప్రెజెంటేషన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలను వేర్వేరుగా చూడాలే తప్ప, మూడింటినీ కలిపి చూడటం సరికాదనీ, ఆ ప్రభావం సంస్థల రుణాలపై తీవ్రంగా పడుతుందని తెలంగాణ విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యాన సదరన్ రీజియన్ పవర్ యుటిలిటీస్ (ఎస్ఆర్పీయూ) సీఎమ్డీల మూడ్రోజుల సమావేశం జరిగింది. ఈనెల 17 నుంచి ఈ సమావేశాలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్ఆర్పీసీ చైర్మెన్, టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి, టీఎస్ ట్రాన్స్‌కో జేఎమ్డీ సీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)తో విద్యుత్ సంస్థల కార్యకలాపాలు, నిబంధనలు, లోటుపాట్లపై చర్చలు జరిపారు. రుణాల మంజూరీలో పీఎఫ్సీ ట్రాన్స్‌కో, జెన్కోల విద్యుత్ కొనుగోలు, సరఫరాల విషయంలో ప్రభుత్వ గ్యారెంటీని అడుగుతున్నారనీ, రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీని ఎఫ్ఆర్బీఎమ్ పరిధిలో చూపిస్తున్నారని వివరించారు. అందువల్ల ప్రభుత్వ గ్యారెంటీ షరతును ఎత్తివేయాలని కోరారు. దేశంలోని 95 శాతం డిస్కంలు నష్టాల్లోనే ఉన్నాయనీ, అయితే అన్ని రాష్ట్రాల్లోని జెన్కో, ట్రాన్స్‌కోలు మాత్రం లాభాల్లోనే ఉన్నాయని చెప్పారు. ట్రాన్స్‌కో, జెన్కోలకు ఇచ్చే రుణాల విషయంలో అక్కడి డిస్కంల ఆర్ధిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలనే తాజా నిర్ణయం సరికాదన్నారు. వీటన్నింటినీ ఒకదానికి ఒకటి ముడిపెట్టొద్దని స్పష్టం చేశారు. ఎవరికి రుణాలు ఇస్తే, ఆ సంస్థ ఆర్థిక పరిస్థితిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటున్నదనీ, దాన్ని తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో పీఎఫ్సీ సీఎమ్‌డీ రవీందర్‌సింగ్ థిల్లాన్‌తో పాటు ఆంద్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి విద్యుత్ సంస్థల సీఎండీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.