Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజరాహిల్స్
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ జాగృతి నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు ఎంపీ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. గురువారం ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకులు పెద్ద సంఖ్యలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఎంపీ అరవింద్ నివాసం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంట్లోకి కొందరు దూరి కిటికీ అద్దాలు, కొన్ని సామాన్లను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎంపీ అరవింద్ తల్లి లీగల్ అడ్వైజర్ కరుణాసాగర్ ద్వారా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ బుర్ర నరసయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎంపీ నివాసానికి చేరుకొని పరిశీలించారు. ఎంపీ నివాసానికి రక్షణ లేనప్పుడు సాధారణ ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతేే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి హైదరాబాద్ నగరంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సి వస్తుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు.