Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పుస్తకాలు, నవలలు స్కాన్ చేస్తే సరిపోతుందని కుచ్చుటోపీ
- 10వేల పేజీల స్కానింగ్‌కు రూ.50వేల సంపాదన
- 620 మంది నుంచి రూ.15కోట్లు వసూళ్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో మరో భారీ మోసం బట్టబయలు అయింది. పాత నవలలు, పాత పుస్తకాలు స్కానింగ్ చేసి ప్రతినెలా వేలకువేలు సంపాదించుకోవచ్చని నమ్మించి మోసం చేసిన ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్థులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ సీపీ భూపాల్ గజారావు వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన దీపక్ శర్మా, ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ ఉద్దీన్, ఆశిస్ కుమార్, అమిత శర్మ ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని ఢిల్లీలో 'డిజినల్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్'ను ఏర్పాటు చేశారు. దాని బ్రాంచ్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోనూ తెరిచారు. ఇంటి వద్ద నుంచి పాత నవలలు, పాత పుస్తకాలు స్కానింగ్ చేసుకోవచ్చని దినపత్రికల్లో, ఎస్ఎమ్ఎస్, సోషల్‌మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేశారు. ప్రతి నెలా 10వేల పేజీలను స్కానింగ్ చేయడం వల్ల రూ.50వేల సంపాదించుకోవచ్చని, తమకు అమెరికా, యూరప్ దేశాల నుంచి వర్క్ ఆర్డర్ ఉందని నమ్మించారు. నిజమని నమ్మిన వారు బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి వెళ్లి పెద్దఎత్తున డబ్బు డిపాజిట్ చేశారు. మొదట మూడు, నాలుగు నెలలపాటు బాధితులకు సక్రమంగా డబ్బులు చెల్లించారు. వారిని పూర్తిగా నమ్మించి రూ.5లక్షలు డిపాజిట్ చేస్తే మరింత వర్క్ ఆర్డర్ ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో 620 మంది నుంచి రూ.15కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించారు. ఈ ఏడాది జులై నుంచి కార్యాలయం మూసేయడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. ఆరా తియ్యగా నిందితులు పరారైనట్టు గుర్తించిన బాధితులు సీసీఎస్‌లోని వైట్‌కాలర్ విభాగంలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఏసీపీ ఎస్.వి.హరికృష్ణ నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలోవున్న దీపక్ శర్మ కోసం గాలిస్తున్నామని జాయింట్ సీపీ తెలిపారు.