Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాలను కలుషితం చేస్తున్నాయి
- వివాదాల ముసుగులో తప్పిదాల నుంచి తప్పించుకోలేరు : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ ఫిరాయింపుల కోసం ఎవరు సంప్రదించారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ కలుషిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని విమర్శించారు. వాటాల్లో తేడాలు రావడంతోనే ఆ పార్టీల మధ్య కొట్లాట ప్రారంభమైందని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈడీ, సీబీఐలతో బీజేపీ దాడులు చేయిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఏసీబీ, సీట్, పోలీసులతో దాడులు చేయిస్తున్నదని చెప్పారు. ఈ రకమైన వివాదాల ముసుగులో ఎనిమిదేండ్లల్లో జరిగిన తప్పిదాలను తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 'ఎమ్మెల్యేలకు ఎర కేసులో కేసీఆర్ వైఖరి హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల మాటలు విని ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చారో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒకసారి అమ్ముడుపోయిన వాళ్లు మరోసారి అమ్ముడుపోలేరా? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లింది? స్టే కోసం ఎందుకు ప్రయత్నించింది? బీజేపీలోకి రావాలని అడిగారంటూ ఎమ్మెల్సీ కవిత అంగీకరించారు. ఈ ఘటనలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నమోదు చేసుకోవాలి' అని కోరారు. విచారణను కేవలం నలుగురు ఎమ్మెల్యేలకే పరిమితం చేస్తే కోర్టు ముందు సిట్ కూడా దోషిగా నిలబడాల్సి వస్తుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజాప్రతినిధుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయని చెప్పారు. తమకు నచ్చని వారిని తుదముట్టించేలా పరిస్థితులు కల్పిస్తున్నాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పక్కదోవ పడుతున్నాయని విమర్శించారు. రైతు రుణమాఫీ, వడ్ల కొనుగోలు, పోడు భూములు, డబుల్ బెడ్రూమ్, ఫీజురీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, మల్లన్న సాగర్, మిడ్ మానేరు ముంపు బాధితులు, డిండి ప్రాజెక్టు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి వాటిపై చర్చ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో చర్చించి త్వరలోనే కాంగ్రెస్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ ఏడు నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో బీసీ జనాభా లెక్కలు, వారికి దక్కాల్సిన నిధులు తదితర అంశాలపై పోరాటం చేస్తామన్నారు.
రేవంత్‌తో బ్రిటీష్ హైకమిషనర్ భేటీ
టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డితో బ్రిటీష్ హైకమిషనర్ సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.