Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27న బహిరంగ సభను జయప్రదం చేయండి: రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండా శ్రీశైలం
- మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ- నల్లగొండ
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభను ఈ నెల 27, 28, 29 తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండా శ్రీశైలం, జిల్లా కార్యదర్శి కున్ రెడ్డి నాగిరెడ్డి తెలిపారు. మొదటి రోజు 27న పట్టణంలో జరిగే ప్రదర్శన- బహిరంగ సభలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డికొమరయ్య భవనంలో రాష్ట్ర మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘకాలం పోరాడి విజయం సాధించిన విషయం తెలిసిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం.. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని, విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 55ఏండ్లు నిండిన రైతులకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని, కౌలు రైతులను గుర్తించి కార్డులు, పంట రుణాలు, బీమా రైతుబంధు ఇవ్వాలని కోరారు. ఆహార ఉత్పత్తుల, పాల ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, పురుగుల మందుల ధరలను తగ్గించాలని, పీఎం ప్రణామ్ను ఉపసంహరించాలని అన్నారు. కల్తీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలు రైతాంగానికి మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, మహిళా రైతు రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, నాయకులు కత్తి శ్రీనివాస్ రెడ్డి, పాల్వాయి రామ్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, ఊట్కూరి నారాయణరెడ్డి, డీసీసీిబీ మాజీ వైస్ చైర్మెన్ సయ్యద్ హాశమ్, కుంభం కృష్ణారెడ్డి, సాగర్ల మల్లేశం, రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.