Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికల కమిటీలు
- 25 నియోజకవర్గాల్లో పోటీకి సమాయత్తం
- వచ్చేనెల 7న చలో రాజ్‌భవన్ ముట్టడి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సీపీఐ కంటే బీజేపీ పెద్ద పార్టీ కాదనీ, అన్ని జిల్లాల్లో తమ పార్టీకి బలముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో ఇంతకు బీజేపీ ఉన్నదా? అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ మఖ్దూం భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఎన్.బాలమల్లేశ్, ఈ.టి.నర్సింహాతో కలిసి కూనంనేని విలేకర్లతో మాట్లాడారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న 'చలో రాజ్భవన్ముట్టడి' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా గుర్తించిన ప్రజా సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. దేశంలో బీజేపీ తిమింగలంగా మారిందని విమర్శించారు. బలం ఉందో, లేదో కూడా తెలయనివారు తామే సీఎం అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీని వ్యతిరేకించే బలమైన ప్రజాస్వామ్య పార్టీలతో అంశాల ప్రతిపాదికన, ఆయా సందర్భాల్లో కలిసి నడవాలని నిర్ణయించామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీని నిలువరించాల్సిన అవసరముందని చెప్పారు. ప్రస్తుత పద్ధతినే భవిష్యతులో టీఆర్ఎస్ కొనసాగిస్తే, ఎన్నికల అవగాహన ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకర్గాల్లో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ పార్టీ బలంగా ఉన్న 25 నియోజకవర్గాలను గుర్తించామన్నారు. నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తా మన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో శిక్ష పడకుండా బీజేపీ తప్పించు కుంటుందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన పాత్రను మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.
నూతన రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎన్నిక
సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి వర్గాన్ని రాష్ట్ర సమితి ఎన్నుకున్నది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శుక్రవారం నూతన కార్యదర్శి వర్గాన్ని ప్రకటించారు. సెప్టెంబర్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర తృతీయ మహాసభలో రాష్ట్ర సమితిని ఎన్నుకోగా, రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్న విషయం తెలిసిందే. నూతన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యులుగా చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, పశ్మపద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఎన్.బాలమల్లేశ్, బాగంహేమంత్రావు, కలవేని శంకర్, ఎం.బాలనర్సింహా, వి.ఎస్.బోస్, ఈటి.నర్సింహా ఎన్నికయ్యారు.