Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యశోద ఆస్పత్రికి తరలించిన అధికారులు
- చికోటి ప్రవీణ్ నాకు స్నేహితుడే : దేవేందర్ రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. క్యాసినో కేసుకు సంబంధించి ఈడీ ఇచ్చిన నోటీసు మేరకు శుక్రవారం దర్యాప్తు అధికారుల ముందు ఉదయం రమణ హాజరయ్యారు. ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకొని మూడో అంతస్తులో ఉన్న అధికారుల వద్దకు మెట్లు ఎక్కుతూ వెళ్లారు. అక్కడకు వెళ్లగానే కొద్ది సేపటికే రమణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా పడిపోబోతున్న రమణను ఈడీ అధికారు లు కూర్చోబెట్టి నీళ్లు తాగించినప్పటికీ ఆయన పరిస్థితులు మెరుగుకాలేదు. దాంతో కంగారు చెందిన ఈడీ అధికారులు రమణను వెంటనే బషీర్‌బాగ్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమికంగా చికిత్స చేశాక రమణ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో రమణకు గుండెలో స్టంటు వేయటం జరిగింది. ఆ నేపథ్యంలోనే రమణ మూడు అంతస్థుల మెట్లు ఎక్కి రావటంతో అస్వస్థతకు గురైనట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులోనే విచారణకు హాజరు కావాల్సిన మెదక్ డీసీసీబీ చైర్మెన్ దేవేందర్ రెడ్డి ఏ కారణం చేతనో హాజరు కాలేదు.విదేశాలలో క్యాసినో నిర్వహిస్తున్న కేసులో నిందితుడు చికోటి ప్రవీణ్ తనకు స్నేహితుడేనని మెదక్ డీసీసీబీ చైర్మెన్ దేవేందర్‌రెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలిపారు. తాను విదేశాలలో క్యాసినోలో పాల్గొనటం జరుగుతుందనీ, అది అక్కడ చట్ట విరుద్ధమేమీ కాదని ఆయన చెప్పారు. కాగా, నేపాల్‌లో చికోటి ప్రవీణ్ నిర్వహించిన క్యాసినోలో తాను పాల్గొనలేదనీ, అయితే నేపాల్‌కు తాను టూరిజం పర్యటనలో భాగంగా వెళ్లానని దేవేందర్‌రెడ్డి వివరించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమణను తిరిగి ఎప్పుడు విచారించేది అతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఈడీ అధికారులు నిర్ణయిస్తారని తెలిసింది.