Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెన్త్, ఇంటర్ ధ్రువపత్రాలపై త్వరలో నిర్ణయం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ పోర్టల్ ఆవిష్కరణ
- అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం : డీజీపీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోనే ఇదో మైలురాయి అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. త్వరలోనే టెన్త్, ఇంటర్ విద్యార్థుల ధ్రువపత్రాలపైనా నిర్ణయం తీసుకుంటామనీ, వారి సర్టిఫికెట్లను ఈ పోర్టల్ పరిధిలోకి తెస్తామని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో 'స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ (ఎస్‌ఏవీఎస్)' పోర్టల్‌తోపాటు రీడిజైన్ చేసిన ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ను కూడా మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇది ఒకరోజులో చేసిన పని కాదన్నారు. వీసీలు, అధికారులు, పోలీసులు ఎంతో చొరవ చూపారని చెప్పారు. అందరూ బాగుండాలంటూ సీఎం కేసీఆర్ కోరుకుంటారని వివరించారు. రైతు విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ఎలా కష్టపడతారో విద్యార్థులు కూడా ప్రతి ఏటా అలాగే ఉంటారని అన్నారు. మోసాలకు పాల్పడుతున్న వారికి అడ్డుకట్ట వేసేందుకే ఈ పోర్టల్‌ను తెచ్చామన్నారు. నకిలీ విత్తనాలను ఎలా అడ్డుకట్ట వేస్తున్నామో అలాగే నకిలీ సర్టిఫికెట్లకూ అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని చెప్పారు. వాటిని నివారించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తున్నదని వ్యాఖ్యానించారు. నకిలీ సర్టిఫికెట్ల అడ్డుకట్ట వేసేందుకు ఓ పోర్టల్‌ను తీసుకురావడం దేశంలోనే మొదటిది అని అన్నారు. ఒక అడుగు ముందుకు పడిందన్నారు. ఈ పోర్టల్‌లో ఉన్న సర్టిఫికెట్లు నమ్మకంగా ఉంటాయని చెప్పారు. నకిలీలకు తావులేదన్నారు. పకడ్బందీగా అమలు చేస్తామనీ, ఇందుకు పర్యవేక్షణ చాలా ముఖ్యమని అన్నారు.
నకిలీ సర్టిఫికెట్లుండొద్దు : డీజీపీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడా నకిలీ సర్టిఫికెట్లుండొద్దని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి చెప్పారు. వీసీలు, విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగం, ఉన్నత విద్యకెళ్లినా ఇది దోహదపడుతుందని చెప్పారు. అయితే నకిలీ సర్టిఫికెట్లను సృష్టించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామనీ, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవస్థను నిర్మూలించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.
2010 నుంచి అందుబాటులో సర్టిఫికెట్లు : లింబాద్రి
రాష్ట్రంలోని వ్యవసాయం, ఆరోగ్య కలిపి 15 విశ్వవిద్యాలయాల్లోని 2010 నుంచి విద్యార్థులకు చెందిన సర్టిఫికెట్లు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. ఉద్యోగం, ఉన్నత విద్యకు వెళ్లాలంటే నకిలీ సర్టిఫికెట్లు పెద్ద సమస్యగా ఉందన్నారు. దానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ పోర్టల్‌ను తెచ్చామని వివరించారు. ఎవరు ఎక్కడి నుంచైనా ఇందులో సర్టిఫికెట్లను పరిశీలించొచ్చని సూచించారు. సమయం, ప్రయాణించడం వంటివి ఉండబోవని చెప్పారు. ఉద్యోగం పొందేవారికి, ఇచ్చే వారికి దోహదపడుతుందన్నారు. వెంటనే సర్టిఫికెట్ గురించి తెలుసుకోవాలంటే ఉచితంగా సేవలుంటాయని అన్నారు. ఆ విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు పొందాలంటే రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఐదుగురి విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు : వెంకటమరణ
త్రిపుల్‌ఐటీ బాసరలో ఐదుగురి విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదైందని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్, త్రిపుల్‌ఐటీ బాసర వీసీ వి వెంకటరమణ అన్నారు. ఆ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై శనివారం అత్యవసర క్రమశిక్షణా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. డిసెంబర్ రెండోవారంలో వర్సిటీ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామనీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, వర్సిటీల వీసీలు పాల్గొన్నారు.