Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 47 శాతం పాఠశాలల్లో హెచ్ఎంలు, టీచర్ల ఖర్చుతోనే నిర్వహణ
- 277 స్కూళ్లలో ప్రారంభం కాని మన ఊరు-మనబడి పనులు
- బడుల్లో వండిన చోట 90 నుంచి వంద శాతం తింటున్న విద్యార్థులు
- సెంట్రలైజ్డ్ కిచెన్లున్న ప్రాంతాల్లో 30 నుంచి 60 శాతమే
- ఉపాధ్యాయుల కొరత వాస్తవమే...
- తెలంగాణ పౌర స్పందన వేదిక సర్వేలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సర్కారు బడుల్లో పారిశుధ్యం నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. 47 శాతం పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే ఖర్చును భరించి పారిశుధ్యం నిర్వహణను చేపట్టడం గమనార్హం. 2.2 శాతం బడుల్లో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, 50.8 శాతం స్కూళ్లలో గ్రామపంచాయతీల సహకారంతో పారిశుధ్యం పనులు సాగుతున్నాయి. తెలంగాణ పౌర స్పందన వేదిక (టీపీఎస్వీ) ఆధ్వర్యంలో 33 జిల్లాల్లోని 1,639 ప్రభుత్వ పాఠశాలల్లో గతనెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో సర్వే చేపట్టింది. ఉపాధ్యాయుల కొరత, మన ఊరు-మనబడి పనుల పురోగతి, పారిశుధ్యం పరిస్థితి, మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల సంఖ్య వంటి అంశాలపై ఈ సర్వేను చేసింది. ఇందులో సర్కారు బడుల్లో ఉన్న సమస్యలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. 1,043 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. 498 ఎస్జీటీ, 266 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, 191 స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్, 138 స్కూల్ అసిస్టెంట్ తెలుగు, 132 స్కూల్ అసిస్టెంట్ హిందీ, 109 స్కూల్ అసిస్టెంట్ గణితం, 108 స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, 73 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు అవసరమున్నట్టు వెల్లడైంది.
14 బడుల్లోనే వంద శాతం పనులు పూర్తి
రాష్ట్రంలోని 1,639 స్కూళ్లలో సర్వే చేస్తే 910 పాఠశాలలు 'మన ఊరు-మనబడి' కార్యక్రమానికి ఎంపికయ్యాయి. వాటిలో 14 పాఠశాలల్లోనే వంద శాతం పనులు పూర్తి కావడం గమనార్హం. మిగిలిన 896 స్కూళ్లలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇందులో 65 పాఠశాలల్లో 75 శాతం, 87 స్కూళ్లలో 50 శాతం, 317 బడుల్లో 25 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే 277 పాఠశాలల్లో ఇంకా పనులే ప్రారంభం కాకపోవడం గమనార్హం. 88 శాతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీల ద్వారానే వండి పెడుతున్నారు. అక్కడే వండి వేడి, వేడిగా వడ్డిస్తున్న బడుల్లో 92 శాతం నుంచి వంద శాతం విద్యార్థులు తింటున్నారు. కానీ సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా సరఫరా చేస్తున్న పాఠశాలల్లో మాత్రం 30 శాతం నుంచి 60 శాతం వరకు విద్యార్థులే భోజనం చేస్తున్నారు. మిగిలిన విద్యార్థులు ఇంటినుంచే భోజనం తెచ్చుకుని తింటున్నారు. ఉదయం సరాఫరా చేసిన అన్నం మధ్యాహ్నం తినే సమయానికి రుచికరంగా ఉండడం లేదంటూ ఎక్కువ మంది విద్యార్థులు వాపోయారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో పలు సమస్యలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సతమతమవుతున్నారు.
సీఎం సమీక్షించాలి : టీపీఎస్వీ డిమాండ్
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణ, ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించాలని టీపీఎస్వీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల కొరత లేదంటున్న పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ అంశాలపై స్పందించాలని కోరారు. మన ఊరు-మనబడి కార్యక్రమం పనులను వేగవంతం చేయాలని సూచించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరాపై డీఈవోలు సమీక్షించాలని కోరారు. మధ్యాహ్న భోజనాన్ని ఏజెన్సీల ద్వారానే వండితే ఎక్కువ మంది విద్యార్థులు తింటారని తెలిపారు.