Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యంగా పోరాడాలని పిలుపు
- ఘనంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ మహాసభ ప్రారంభం
- ఆ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర : ప్రశాంత్ నంది చౌదరి
- వేతనాలు సవరించాలి : సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యుత్ విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగానూ.. కార్మికులకు వ్యతిరేకం గానూ ఉన్నాయని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లు వల్ల భవిష్యత్తులో ఆ రంగంలో పెను మార్పులు చోటు చేసుకోబో తున్నాయనీ, ప్రజలపై కరెంటు భారాలు విపరీతంగా పడనున్నాయని ఆయన హెచ్చరించారు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
రెండు రోజులపాటు కొనసాగే తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్యూఈఈయూ) రాష్ట్ర మూడో మహాసభ శనివారం ఎల్బీ నగర్లో ప్రారంభమైంది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ఆనందచారి యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ నంది చౌదరి ముఖ్య వక్తగా హాజరయ్యారు. సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు ఎం సాయి బాబు, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ పి రత్నాకర్ రావు హాజరయ్యారు. మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన చెరుపల్లి మాట్లా డుతూ... మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతుల నడ్డివిరిచేందుకు కేంద్రం ప్రయత్నించిందని గుర్తు చేశారు. అలాంటి చర్యలను వారు ఐక్యంగా తిప్పికొట్టారని వివరించారు. ఈ నేపథ్యంలో అన్నదాతల స్ఫూర్తితో విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ వామపక్షాలు పోరాటాలు చేస్తున్నాయని తెలిపారు. వాటిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. చౌదరి మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణ బిల్లు చట్టంగా మారకముందే ఆర్డినెన్స్ రూపంలో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నదని హెచ్చరించారు. ఇలాంటి కుయుక్తులను విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు ఐక్యంగా తిప్పి కొట్టాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలను ప్రయివేటీకరించటానికి ప్రయత్నిస్తే అక్కడి కార్మిక వర్గం పోరాడి తిప్పికొట్టిన వైనాన్ని వివరించారు. ఇది వారు సాధించిన విజయమని తెలిపారు. సాయిబాబు ప్రసంగిస్తూ విద్యుత్ ఉద్యోగులకు వేతనాలను యాజమాన్యం వెంటనే సవరించాలనీ, ఆర్టిజన్ కార్మికులను పూర్తిస్థాయిలో క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. మిగిలిన 6,500 మంది పీస్ రేట్ కార్మికులకు కూడా కనీస వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కుమార చారి, ప్రధాన కార్యదర్శి వి గోవర్ధన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ స్వామి, గౌరవాధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. ఈశ్వర్రావు పాల్గొన్నారు.