Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులు పొందుతున్న వారిలో 90 శాతం మహిళలే
2021-22లో 1,059.66 లక్షల పనిదినాలు కల్పించాం. ఉపాధి హామీ చట్టంలో 2016-17లో 14.57 లక్షల కుటుంబాలకు పని కల్పిస్తే, 2021-22 నాటికి 16.17 లక్షలకు వాటి సంఖ్య పెరిగింది. ఈ కాలంలో వంద రోజుల ఉపాధి పొందిన వారు ఐదు రెట్లు పెరిగారు. గిరిజన ప్రాంతాల్లో 'ట్రైబల్ ప్లస్' కార్యక్రమం పేరుతో 200 రోజుల పని కల్పిస్తున్నాం. ఉపాధి హామీ చటంలో 90 శాతం నిధులను భూమి, నీరు, భూగర్భ జలాల పెరుగుదల కోసమే ఖర్చు చేస్తున్నాం.
- 'ట్రైబల్ ప్లస్' పేరుతో గిరిజన ప్రాంతాల్లో 200 రోజుల పని
- డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యుద్ధం
- విజ్ఞాన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం
- డిజిటల్ రంగంలో ఉపాధి అవకాశాల కల్పన
- ప్రజల భాగస్వామ్యంతో అధికార వికేంద్రీకరణ
- పేదరిక నిర్మూలనకు ఎల్డీఎఫ్ సర్కారు ప్రాధాన్యత
- గవర్నర్ల నిర్ణయాలు రాజ్యాంగ వ్యతిరేకం
- నవతెలంగాణతో కేరళ మంత్రి ఎంబీ రాజేశ్
ఉపాధి హామీ చట్టం అమల్లో దేశంలోనే తమ రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందని కేరళ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేశ్ అన్నారు. అతి ఎక్కువ పనిదినాలను కల్పించడంతోపాటు వేతనాలను అధికంగా చెల్లించడంలో కేరళ రోల్‌మోడల్‌గా ఉందన్నారు. ఈ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్న వారిలో 90 శాతం వరకు మహిళలే ఉన్నారని వివరించారు. ట్రైబల్ ప్లస్ కార్యక్రమం పేరుతో గిరిజన ప్రాంతాల్లో 200 రోజుల పని కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అధికార వికేంద్రీకరణను చేపట్టామని అన్నారు. అందుకే మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు. కేరళలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిందన్నారు. అందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లోని గవర్నర్ల నిర్ణయాలు రాజ్యాంగ వ్యతిరేకమని విమర్శించారు. ఆ వ్యవస్థ జాతీయ సమస్య అని చెప్పారు. ఇటీవల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన రాజేశ్ నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
కేరళలో ఉపాధి హామీ చట్టం అమలు పరిస్థితి ఎలా ఉంది?
ఉపాధి హామీ చట్టాన్ని కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. 2016-17లో 684.62 లక్షల పనిదినాలుంటే, 2018-19లో 975.66 లక్షలకు పెరిగాయి. 2021-22లో 1,059.66 లక్షల పనిదినాలు కల్పించాం. ఉపాధి హామీ చట్టంలో 2016-17లో 14.57 లక్షల కుటుంబాలకు పని కల్పిస్తే, 2021-22 నాటికి 16.17 లక్షలకు వాటి సంఖ్య పెరిగింది. ఈ కాలంలో వంద రోజుల ఉపాధి పొందిన వారు ఐదు రెట్లు పెరిగారు. గిరిజన ప్రాంతాల్లో 'ట్రైబల్ ప్లస్' కార్యక్రమం పేరుతో 200 రోజుల పని కల్పిస్తున్నాం. ఉపాధి హామీ చటంలో 90 శాతం నిధులను భూమి, నీరు, భూగర్భ జలాల పెరుగుదల కోసమే ఖర్చు చేస్తున్నాం. ఈ చట్టంలో పనిచేస్తున్న వారి వేతనాలు 99.1 శాతం పెరిగాయి. దేశంలోనే మహిళలు పాత్ర ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటిస్థానంలో ఉన్నది. మా దగ్గర 90 శాతం మహిళలే ఉపాధి హామీలో పనులు పొందుతున్నారు. ఇటీవల కేరళ ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించకుంటే పరిహారం చెల్లించాలని నిర్ణయించాం. ఆలస్యం చేసినందుకు అధికారులపై చర్యలుంటాయి. ఉపాధి హామీ అమల్లో జాతీయ సగటు 54.7 శాతం ఉంటే, కేరళలో 89.42 శాతం నమోదైంది. గిరిజన కుటుంబాలు జాతీయ స్థాయిలో 12 శాతం ఉపాధి పొందితే, కేరళలో 40 శాతం ఉన్నాయి. ఎస్సీలు జాతీయ స్థాయిలో 48 శాతం ఉంటే, కేరళలో 67 శాతం ఉంది. ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రంగా కేరళ నిలిచింది.
అక్కడ ఇతర ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన గురించి వివరిస్తారా?
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై కేరళ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారు 37 శాతం మంది ఉన్నారు. విజ్ఞాన, ఆర్థిక రంగంగా కేరళను తీర్చిదిద్దాలి. అందులో భాగంగా ఐటీ, బయోటెక్నాలజీ వంటి రంగాపై దృష్టిసారించాం. ఉపాధి అవకాశాల కల్పన కోసమే కేరళ నాలెడ్జ్ ఎకానమి మిషన్‌ను ప్రారంభించాం. గ్రామం, వార్డు స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. డిజిటల్ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. స్థానిక ప్రభుత్వాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. యువకులు కొత్త ఆవిష్కరణలు చేసేందుకు మేం సాంకేతిక పరిజ్ఞానం అందిస్తాం.
పొదుపు సంఘాల్లోని మహిళల అభివృద్ధి గురించి చెప్పండి?
కుటుంబశ్రీ దేశానికే మోడల్. ఇందులో 46 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారిని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సహకరిస్తున్నాం. కొచ్చిన్, కాలికట్ విమానాశ్రయాల్లో షీస్టాట్స్ను ప్రారంభించాం. దానివల్ల మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇంకోవైపు కుటుంబశ్రీలోని మహిళలు తయారు చేసే చాక్లెట్, డెయిరీ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఉన్నది. ఆన్‌లైన్‌లోనూ విక్రయించాలని ఆలోచిస్తున్నాం.
అక్కడి స్థానిక సంస్థల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించండి?
కేరళ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే అధికార వికేంద్రీకరణకు ప్రయత్నాలు చేసింది. 73,74 రాజ్యాంగ సవరణలు 1992లో జరిగాయి. అయితే అధికార వికేంద్రీకరణ ప్రజల భాగస్వామ్యంతో ఉండాలన్నది కేరళ ప్రభుత్వ ఆలోచన. గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలుండాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయించి అమలు చేయడం సరికాదు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమస్యలపై అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తారు. స్థానిక సంస్థలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుంది. ఇంకోవైపు పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో పేదరిక నిర్మూలనకు మేం ప్రాధాన్యతనిస్తున్నాం. శాస్త్రీయంగా సర్వే చేసి 64,006 కుటుంబాలను గుర్తించాం. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నాం. ఆహారం, ఆరోగ్యం, ఇతర సమస్యలున్నాయి. వారి కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆరోగ్య క్యాంపులు నిర్వహిస్తాం. నాలుగేండ్లలో వారంతా పేదరికం నుంచి దూరం కావాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. అందరికీ ఇండ్ల పథకం అమలవుతున్నది. 3.11 లక్షల గృహాలను నిర్మించాలన్నది మా లక్ష్యం. అందులో ఈ ఏడాది 1.60 లక్షల ఇండ్లు కడతాం. గ్రీన్ యాక్షన్ ఆర్మీని ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో హరిత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం. కేరళలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం. అక్టోబర్ రెండు నుంచి నవంబర్ ఒకటి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. రాజకీయ పార్టీలూ మద్దతిచ్చాయి. డ్రగ్స్‌ను నివారించాలంటూ ఈనెల 14 నుంచి జనవరి 26 వరకు ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. దీనికి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్గంగూలీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. సినీనటులు, క్రీడాకారులు మద్దతుగా ఉన్నారు.
కేరళలో మీ గవర్నర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు కదా ఎందుకు?
ఇది కేరళకే పరిమితం కాదు. తెలంగాణ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. గవర్నర్ల సమస్య ఒక రాష్ట్రానికి కాకుండా జాతీయ సమస్యగా మారింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడుతున్నది. కర్నాటక, గోవా, మహారాష్ట్రలో సక్సెస్ అయ్యింది. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీల ద్వారా ఎమ్మెల్యేలను లొంగదీసుకోవాలని చూస్తున్నది. ఇంకోవైపు రాజ్భవన్లు దుర్వినియోగం అవుతున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా పాలించాలని బీజేపీ చూస్తున్నది. ఇలా గవర్నర్లు వ్యవహరించడం రాజ్యాంగ వ్యతిరేకం. కేరళలో వీసీల నియామకాల్లో ఎక్కడా తప్పు జరగలేదు. అర్హతల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులనే వీసీలుగా నియమించాం. అయితే సాంకేతిక సమస్య వచ్చింది. యూజీసీ నిబంధనల ప్రకారం ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను సెర్చ్‌కమిటీ గవర్నర్‌కు పంపాలి. కానీ ఒకరి పేరునే పంపాలని కేరళ ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చి చట్టం చేసింది. దాన్ని సుప్రీంకోర్టు సైతం అంగీకరించింది. సెర్చ్ కమిటీ ఒక పేరునే గవర్నర్‌కు పంపాలని ఉంది. దీన్ని గవర్నర్ తప్పుపడుతున్నారు. అందుకే వివాదం నెలకొన్నది.