Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్ నోటీసులపై స్టేకు హైకోర్టు నో
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ నేతలకు ఇచ్చిన నోటీసులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. నోటీసుల అమలును నిలిపేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ విచారణకు హాజరు కావాలని బీజేపీ అగ్ర నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి బీ.ఎల్.సంతోష్, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లను ఆదేశించింది. దర్యాప్తు చేసే సిట్ వారిని వివరాలు రాబట్టాలే గానీ అరెస్టు చేయరాదని చెప్పింది. సిట్ అధికారులు ఢిల్లీలోని నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు వెళితే అక్కడి పోలీసులు సహకరించడం లేదని ప్రభుత్వం దాఖలు చేసిన మరో అనుబంధ పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారణ జరిపి ఢిల్లీ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఢిల్లీ పోలీసులు సిట్ నోటీసులను అక్కడ ఉంటే బీ.ఎస్.సంతోష్‌కు అందజేయాలని చెప్పింది. హైకోర్టు ఆర్డర్ కాపీని ఢిల్లీ పోలీసులకు సిట్ అందజేయాలని చెప్పింది. ఈ మేరకు జస్టిస్ విజరుసేన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21న సిట్ విచారణకు హాజరుకావాలని సంతోష్, శ్రీనివాస్‌లకు ఇచ్చిన నోటీసులను బీజేపీ హైకోర్టులో సవాల్ చేసింది. నోటీసుల అమలును ఆపేయాలని కోరితే అందుకు హైకోర్టు నిరాకరించింది. సంతోష్, శ్రీనివాస్‌లను అరెస్టు చేయొద్దనీ, సిట్ దర్యాప్తునకు వారిద్దరూ హాజరుకావాలనీ, సిట్ దర్యాప్తును కొనసాగించవచ్చునని చెప్పింది. సిట్ దర్యాప్తును సింగిల్ జడ్జి రోజు వారీ పర్యవేక్షణ చేయాలనీ డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా స్పష్టత లేదని చెప్పింది. విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.
బీజేపీ తరఫున సీనియర్ అడ్వొకేట్ వైద్యనాథన్ వాదించారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేసేలా జాతీయ స్థాయిలో బీజేపీకి మచ్చ తెచ్చేలా సిట్ దర్యాప్తు ఉండబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంతోష్‌కు 41ఎ నోటీసు జారీ అయ్యాయనీ, అరెస్టులు చేసేందుకే ఈ నోటీసు ఇచ్చారని చెప్పారు. దర్యాప్తునకు హాజరుకాకపోతే అరెస్టు చేస్తామని అంటున్నారని తెలిపారు. సిట్ దర్యాప్తు రహస్యంగా ఉంచాలని హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సిట్ నోటీసుల నుంచి నిందితుల విచారణ వరకు అన్నీ పత్రికల్లో, టీవీల్లో వచ్చాయన్నారు. ఇది కోర్టు ధిక్కారమే అన్నారు. కేసుతో సంబంధం లేని బీజేపీ నేతలకు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయమన్నారు. సింగిల్ జడ్జి అనుమతి లేకుండానే సంతోష్ ఇతరులకు 41ఎ నోటీసు ఇచ్చారనీ, అవి చెల్లవన్నారు. అక్రమ నోటీసులపై స్టే మంజూరు చేయాలని, సంతోష్‌ను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
దర్యాప్తులో భాగంగానే సంతోష్‌కు ఇతరులకు నోటీసులు జారీ అయినట్లుగా ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ వాదించారు. నిందితులతోపాటు అనుమానితులకు కూడా నోటీసులు 41ఎ నోటీసులు ఇవ్వవచ్చునని చెప్పారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ చంద్రభారతి, కోరె నందుకుమార్, సింహయాజిలను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితులు, కేసు దర్యాప్లులో పొందిన సమాచారం ఆధారంగా ఈ కేసులో సంతోష్‌ను విచారణ చేయాలని సిట్ నిర్ణయించడాన్ని తప్పుపట్టక్కర్లేదని చెప్పారు. అంతా అమిత్‌షా, సంతోష్ చూసుకుంటారని కూడా ఫోన్ సంభాషణల్లో ఉందన్నారు.
సిట్ లంచ్‌మోషన్ పిటిషన్
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ఢిల్లీలోని బీజేపీ నేతలకు నోటీసుల జారీ చేసేందుకు అక్కడి పోలీసులు సహకరించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సిట్ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని శనివారం జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి విచారణ జరిపారు. సిట్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ, నోటీసు జారీ చేసేందుకు సిట్ అధికారులు వెళితే, తాము వేరే పనుల ఒత్తిడిలో ఉన్నామనీ, తాము సహకరించలేమని ఢిల్లీ పోలీసులు చెప్పారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుకు తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతూనే హైకోర్టులో కేసుల మీద కేసులు వేస్తున్నారని తప్పుపట్టారు. గుడికి తడిబట్టలతో వెళ్లి ప్రమాణాలు చేస్తారనీ, ఇక్కడికి వచ్చి కేసులు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు కుట్ర జరిగినట్టుగా సిట్ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని, ఇలా చేయడం సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని అన్నారు. నిజాలు నిగ్గు తేలాలంటే సిట్ దర్యాప్తు జరగాలన్నారు. వాదనల తర్వాత హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సిట్ పోలీసులకు ఢిల్లీ పోలీసులు సహకరించాలని ఆదేశించింది.