Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న పులులు
- పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్న రైతులు, కూలీలు
- పశ్చిమాన పశువులు.. తూర్పున మనుషులపై దాడి
- రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో భయం.. భయం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పెద్ద పులులు వణికిస్తున్నాయి.. జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. పంట చేలకు వెళ్లేందుకు సైతం జంకుతున్నారు. గాలికి ఆకులు అదిలినా.. పొరక కదిలినా.. సమీపంలో ఏదైనా అలికిడి వినిపించినా..పక్క నుంచి కుక్కలు పరుగులు తీసినా.. భయంతో వణికిపోతున్నారు. వారం రోజులుగా బెబ్బులి గాండ్రిపులతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రమహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా అడవుల నుంచి పెద్ద పులులు జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశిస్తుండటంతో సర్వత్రా భయాందోళన నెలకొంది. జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు చేసినప్పటికీ.. అందులోకి వెళ్లకుండా పంట పొలాల్లోనే తిరుగుతున్నాయి. రెండ్రోజుల కిందట కాగజ్‌నగర్ పట్టణానికి రావడంతో జనం మరింత ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి తిరిగిన ప్రదేశాలను పరిశీలిస్తూ జనాలను అప్రమత్త్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. పెద్ద పులులు జిల్లాలోని తూర్పు ప్రాంతంలో మనుషులపై దాడి చేస్తుండగా.. పశ్చిమ జిల్లాలో పశువులను హతమార్చడం భయాందోళన రేకెత్తిస్తోంది.
ఇది వరకు జిల్లాకు ఒకటి, రెండ్రోజులపాటు వచ్చిపోయే పులులు వారం రోజులుగా ఇక్కడే తిష్ట వేస్తుండటం.. అదీ అటవీ ప్రాంతంలో కాకుండా పంట పొలాలు, గ్రామాలకు సమీపంలో సంచారంతో జనం భయంతో వణికిపోతున్నారు. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం ఉన్నప్పటికీ.. అందులోకి వెళ్లకుండా సరిహద్దు గ్రామాల్లోనే సంచరిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రతో సరిహద్దులు పంచుకుంటున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి పదుల సంఖ్యలో పులులు ప్రవేశిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్న తిప్పేశ్వర్ అడవిలో పులుల సంఖ్య పెరగడం.. అక్కడ వాటికి అవసరమైన ఆవాసం లభించకపోవడంతో పెన్‌గంగా నది దాటి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. మరోపక్క మహారాష్ట్రలోని తాడోబా అడవికి సమీపంలో ఉన్న రాజురా అటవీ డివిజన్ నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లోకి పులులు సులువుగా ఇక్కడకు వస్తున్నాయి.
వరుస ఘటనలతో బెంబేలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల దాడిలో పలు పశువులతోపాటు మనుషులు కూడా ప్రాణం కోల్పోతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. కిందటేడాది పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో పత్తి ఏరుతున్న మహిళను హతమార్చిన పులి.. అదే ఏడాది దహెగాం మండలం దిగిడలో ఓ బాలుడిని హతమార్చిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ రెండు ఘటనలే కాకుండా ఇప్పటి వరకు సుమారు 20వరకు ఆవులు, ఎద్దులు, లేగదూడలను చంపేశాయి. తాజాగా వారం రోజుల కిందట వాంకిడి మండలం ఖానాపూర్‌లో పంట చేనుకు కాపలాగా ఉన్న ఓ వృద్ధుడిని పులి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ వారం రోజుల వ్యవధిలోనే సిర్పూర్ మండలం వేంపల్లి దగ్గర ఎనిమిది పశువులను హతమార్చాయి. మరోపక్క భీంపూర్ మండలం తాంసి(కె), పెన్‌గంగా ప్రాజెక్టు కెనాల్లో పులులు సంచరించడం.. రెండ్రోజుల తర్వాత ఇదే మండలంలోని గుంజాల వద్ద ఓ పశువును సగం వరకు తిన్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు నిఘా కోసం రెండు బేస్‌క్యాంపులు ఏర్పాటు చేయడంతో 20వరకు సీసీ కెమెరాలు బిగించి స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు.
అనుక్షణం..భయం..భయం..!
ఉమ్మడి జిల్లా సరిహద్దులో ఇన్నాండ్లు కరోనాతో భయపడిన జనాలు ఇప్పుడు పెద్ద పులుల రాకతో హడలిపోతున్నారు. అక్కడి తిప్పేశ్వర్, తాడోబా అడవులకు కంచె సక్రమంగా లేకపోవడం.. ఆదిలాబాద్ జిల్లా అడవులు కూడా వాటికి ఆనుకొని ఉండటంతో పులులు ఇక్కడకు వస్తున్నాయి. ఆవాసం కోసం ఇక్కడకు వస్తున్నప్పటికీ.. కొన్ని రోజుల పాటు హల్చల్ చేసి తిరిగి పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోతున్నాయి. ఇక్కడకు వస్తున్న పులులను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులోకి పంపించడంలో అటవీశాఖ అధికారులు విఫలమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రస్తుతం జిల్లా సరిహద్దు ప్రాంతాల ప్రజలు అనుక్షణం భయంభయంతో వణికిపోతున్నారు. పంట చేలకు ఒకరిద్దరు కాకుండా గుంపులుగా వెళ్తున్నారు. పత్తి తీసే సమయంలో ఏదైనా కొంచెం అలికిడి వినిపిస్తే రోడ్డుపైకి పరుగులు తీస్తున్నారు. ఎక్కడి నుంచి పులి వచ్చి దాడి చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న అటవీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ భరోసా ఇస్తున్నారు.