Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనాలు అమలు చేయరా?
- సెక్యూరిటీ గార్డుల మహాసభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ ఏలుబడిలో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులకు భంగం వాటిల్లుతున్నదని సీఐటీయూ రాష్ట్ర నేత వంగూరి రాములు ఆవేన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటి సెక్యురిటీ గార్డ్స్ యూనియన్ (సీఐటీయూ)రాష్ట్ర రెండో మహాసభ యూనియన్ అధ్యక్షులు సారిక రాము, పి వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వంగూరి రాములు మాట్లాడుతూ బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, రైతు, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తున్నదన్నారు. వీటికి తోడు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నదని చెప్పారు. దేశ ఆర్థిక రంగంతో పాటు, పారిశ్రామిక, సేవారంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయన్నారు. ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిందని గుర్తుచేశారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోను అమలు చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలిపారు. కార్మికులకు చట్టబద్ధ సౌకర్యాలు దక్కటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డులకు మార్కెట్ కమిటీల నుండే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరికి థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచే వేతనాలు చెల్లించాలన్నారు. ఏజెన్సీలను రద్దు చేసి సెక్యూరిటీ గార్డులను పర్మినెంట్ చేయాలనీ, మార్కెట్ల ద్వారానే ఈపిఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికశాఖ విడుదల చేసిన జీఓ నెం.21ని గెజిట్ చేసి సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు రంగాలకు ఫైనల్ నోటిఫికేషన్లు ఇచ్చినా వాటికి గెజెట్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని తెలిపారు. యాజమాన్యాలకు కొమ్ము కాస్తూ ఆయా జి.ఓ.లను విడుదల చేయడం లేదని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి. మధు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బరితెగించి కార్మిక వ్యతిరేక విధానాలను చేపడుతున్నదని విమర్శించారు. మాటల్లో జాతీయత, దేశభక్తి.. గురించి వల్లిస్తూ.. ఆచరణలో విధ్వంసకర విధానాలను అమలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని సహజ వనరులు, ప్రభుత్వరంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు అప్పనంగా అమ్మేస్తున్నదని తెలిపారు. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై భారాలో మోపుతున్నదని చెప్పారు.
మహిళలు, శ్రామిక మహిళల హక్కులకు విఘాతం కల్గిస్తున్నదనీ, ప్రజాస్వామ్య, పౌర హక్కులను కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థలకు కార్మికవర్గాన్ని బలి చేస్తున్నదని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సెక్యూరిటీ గార్డులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
అనంతరం నూతన కమిటీని మహాసభ ఎకగ్రీవంగా ఎన్నుకున్నది. గౌరవాధ్యక్షులు వంగూరు రాములు (సీిఐటీయూ రాష్ట్ర కేంద్రం), అధ్యక్షులు తుమ్మల సాంబయ్య (వరంగల్), వర్కింగ్ ప్రెసిడెంట్ సారిక రాము (ఖమ్మం), ఉపాధ్యక్షులు గొంగిడి లక్ష్మణ్ (సిద్ధిపేట), ఐలీ సదయ్య (భూపాలపల్లి), పి. వెంకన్న (మంచిర్యాల), బి. వెంకట నారాయణ (మహబూబాబాద్), ఎండి. ముస్తాక్ (ఖమ్మం), ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న (సీఐటీయూ రాష్ట్ర కేంద్రం), సహాయ కార్యదర్శులుగా పి. రాము (మహబూబాబాద్), ఎస్. కుమార్ (ములుగు), సుదారపు రమేష్ (భద్రాద్రి కొత్తగూడెం), మహేందర్ రెడ్డి (సిరిసిల్లా), ఎండి. సాయబ్ హుస్సేన్ (ఆదిలాబాద్), వై. రామాంజయ్య (మహబూబాబాద్), ఏడుకొండలు (ఖమ్మం), కోశాధికారిగా జె. జనార్ధన్ (మహబూబాబాద్) మరో ఎనిమిది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.