Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్మికుల పర్మినెంట్ కోసం పోరాటం
- ఉద్యోగ భద్రత, డబుల్ బెడ్రూమ్స్ కోసం ఆందోళన: మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- డిమాండ్ల సాధన కోసం డిసెంబర్లో మున్సిపాల్టీలు, కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు రాష్ట్ర మహాసభ పిలుపు
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని, కనీస వేతనం రూ.21వేలకు పెంపు, ఉద్యోగ భద్రత కోసం పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర నాలుగో మహాసభ హనుమకొండలోని అమృత గార్డెన్ కందుకూరి లాలునగర్లో రెండో రోజు జరిగింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు (హైదరాబాద్, వరంగల్), 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాల్టీల్లో 64 వేల మంది కార్మికులు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే, డైలీవేజ్ తదితర పద్ధతుల్లో పని చేస్తున్నారని చెప్పారు. పారిశధ్యం, పార్కులు, ఇంజినీరింగ్, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్ విభాగాల్లో పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, జవాన్లు, ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్స్, బిల్ కలెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శానిటరీ జవాన్లు, ఎఫ్ఎస్ఎలుగా పనిచేస్తున్నారని వివరించారు. కాంట్రాక్టు పద్ధతుల్లో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులు పర్మినెంట్ అవుతారని, ఆ లోపు వేతనాలు పెంచుతారని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటే నిరాశే ఎదురవుతోందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల పర్మినెంట్, ఉద్యోగ భద్రత, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగానే తెలంగాణలోని మున్సిపల్ కార్మికులకు వేతనం రూ.21,000 పెంచాలని డిమాండ్ చేశారు. వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 7న మున్సిపాల్టీల వద్ద, 13న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయాలని మహాసభ నిర్ణయించింది. ఉద్యోగ, కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా మహాసభ పలు తీర్మానాలను ఆమోదించింది.
అమరవీరులకు ఘనంగా నివాళులు
మహాసభ రెండో రోజు ప్రారంభానికి ముందు సీఐటీయూ జెండాను యూనియన్ సీనియర్ నాయకులు అంజయ్య ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు ప్రతినిధులు నివాళ్లుర్పించారు. మహాసభకు అధ్యక్షవర్గంగా జనగాం రాజమల్లు నాగమణి వహించారు. సౌహార్ధ సందేశం కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి తపట్ల స్కైలాబ్ బాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి.ఉప్పలయ్య, రాగుల రమేష్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్, విష్ణు, పాండు, మహేష్, కిషన్, ఆర్.వాణి, రజిత, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్, సీఐటీయూ జిల్లా నాయకులు వేల్పుల సారంగపాణి, మెట్టు రవి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
మహాసభ ఆమోదించిన తీర్మానాలు
- రాంకీ ఒప్పందాన్ని రద్దు చెయ్యాలి. జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.24,000కు పెంచాలి.
- పీఆర్సీ ప్రకారం పెరిగిన కొత్త వేతనాలు ఎరియర్స్ సహా అమలు చేయాలి.
- పని దినం 8 గంటలు అమలు చేయాలి. ఆదివారం, జాతీయ, రాష్ట్ర పండుగలకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి.
- డైలీవేజ్ కార్మికులకు కూడా పాత కార్మికుల మాదిరిగా వేతనం, పీఎఫ్, ఈఎస్ఐని సమానంగా ఇవ్వాలి.
- కనీస వేతనాల జీవోలను 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లో రాష్ట్ర ప్రభుత్వం సవరించాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 జీవోలను గెజిట్ చేయాలి.
- కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.
- గ్రామ పంచాయితీ కార్మికులకు జీఓ నెం.60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి.