Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెబ్బై లేఖలు రాసినా స్పందించరేం...
- కేఆర్ఎమ్బీ చైర్మెన్‌కు ఈఎన్సీ మరో లేఖ
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
కృష్ణా జల వివాదాలపై మొదటి ట్రైబ్యునల్ తీర్పులోని అంశాలను అమలు చేయాలని కోరుతూ కష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి 70లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. ఈ లేఖలపై కేఆర్ఎంబీ కానీ, కేంద్ర జలశక్తిశాఖ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం మరో లేఖను కేఆర్ఎంబీకి రాశారు. దానిలో ప్రధానమైన ఏడు అంశాలతో పాటు 70లేఖలకు సంబంధించిన వివరాలను కూడా పొందుపర్చారు. తాగునీటి కోసం తీసుకున్న జలాల్లో 20శాతం మాత్రమే లెక్కించాలని ట్రైబ్యునల్ చెబుతున్నదనీ, ఈ విషయాన్ని పలు లేఖల్లో పేర్కొన్నప్పటికీ బోర్డు అమలు చేయలేదన్నారు. ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ఏడాదిలో కేటాయించిన జలాల్లో మిగిలిన నీటిని వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాల్సి ఉంటుందనీ, దీనిపై పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పందనా లేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 2015, 2017 సంవత్సరాల్లో అడ్‌హక్ ప్రాతిపదికన మాత్రమే కేటాయింపులు చేశారనీ, తెలంగాణకు 70శాతం నీటిని కేటాయించాల్సి ఉందని తెలిపారు. రెండో ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50శాతం అయినా కొనసాగించాలనే తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని, ఛైర్మెన్ ఏకపక్ష నిర్ణయాన్ని 16వ బోర్డు సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించినట్టు పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల రూల్ కర్వ్స్ ఖరారు కోసం సమాచారం, వివరాలు ఇవ్వాలని కేంద్ర జలసంఘాన్ని, బోర్డును కోరినా ఇవ్వలేదన్నారు. చెన్నై తాగునీటి సరఫరా కోసం 1976, 77లో ఇచ్చిన ఒప్పందాలకు లోబడి రూల్ కర్వ్స్ ఖరారు చేయాలని కోరామన్నారు. పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ రూల్ కర్వ్స్ సవరించలేదని వివరించారు.
తెలంగాణకు జలవిద్యుదుత్పత్తి అత్యవసరమనీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి రూల్ కర్వ్స్ సవరణ చేయాలని కోరినా పట్టించుకోలేదని తెలిపారు. స్పిల్ వే ద్వారా విడుదల చేసే నీటిని లెక్కించరాదనే ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన తమకు అంగీకారం కాదని పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోవట్లేదన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కాల్వలపై రియల్ టైం డేటా అక్విజేషన్ సిస్టం ఏర్పాటు చేయాలని మరోమారు కోరారు. ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ పనులు సాగకుండా ఆంధ్రప్రదేశ్ పదేపదే ఆటంకాలు సృష్టిస్తున్నదనీ, దీనిపై చాలా లేఖలు రాసినట్లు తెలిపారు. ఆర్డీఎస్ కుడికాల్వపై అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పనులు నిలువరించాలని, అప్పటి వరకు డీపీఆర్‌ను పక్కన పెట్టాలని కోరామన్నారు. అన్ని అంశాలు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అమలు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఈఎన్సీ కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైనా ఆదేశాలు అవసరమైతే వారి దృష్టికి తీసుకెళ్లాలని కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేశారు.