Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది నుంచి బి కేటరిగీలో స్థానిక రిజర్వేషన్లు అమలు చేసిన సర్కారు
- సీ కేటగిరీకి మార్చేందుకేనని తల్లిదండ్రుల ఆరోపణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంతో కాలం నుంచి చేసిన పోరాట ఫలితంగా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో 85 శాతం సీట్లను రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకే వర్తించేలా ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు వెయ్యి మంది తెలంగాణ బిడ్డలు వైద్యవిద్యను అభ్యసించే అవకాశం లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన పిల్లలను ప్రయివేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినట్టు పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇచ్చిన ఆదేశాలను సైతం కొన్ని ప్రయివేటు మెడికల్ కాలేజీలు పక్కన పెట్టి మొదటి సంవత్సరంలోనే రెండో ఏడాదికి సంబంధించిన ఫీజుకు బ్యాంకు నుంచి బాండ్ తీసుకురావాలని కోరుతున్నట్టు తెలిసింది. అనేక రకాల ఖర్చుల పేరుతో ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నా ... యూనివర్సిటీ వైపు నుంచి కట్టడికి చర్యలుండటం లేదని తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం స్థానికులకు వైద్యవిద్యను అందించేందుకు సంకల్పిస్తే ప్రయివేటు యాజమాన్యాలు మాత్రం దానికి అడ్డుగా నిలుస్తున్నాయని చెబుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను పదే పదే తిప్పడం ద్వారా ఆ సీట్లను మిగిలేలా చేసి వాటిని సీ కేటగిరీలోకి మార్చే కుట్ర చేశారని ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కొంత మంది వాపోయారు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేసినా అడ్మిషన్ తర్వాత పిల్లలను వేధిస్తారనే ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కన్వీనర్ కోటాను పూర్తిగా భర్తీ చేయకుండా యాజమాన్య కోటాను భర్తీ చేయాలని నిర్ణయించడం కూడా విద్యార్థులు, తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేసింది. కన్వీనర్ కోటా సీట్ల కోసం ఎదురు చూడాలా? లేక బీ కేటగిరీలో నిర్ణీత ఫీజు చెల్లించి చేరాలా? అనేది తేల్చుకోలేకపోతున్నామని తెలిపారు. ఇవన్ని కూడా స్థానికులకు వైద్యవిద్యనందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడుస్తున్నాయనీ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావతం కాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.