Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు లక్షల కుటుంబాలను కదిలించాలి: విజయరాఘవన్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 5న నిర్వహించబోయే 'ఛలోఢిల్లీ' కార్యక్రమానికి ఐదు లక్షల కుటుంబాలను కదిలించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ అధ్యక్షులు ఏ విజయ రాఘవన్ పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ సంయుక్త రాష్ట్ర కమిటీ సమావేశానికి ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ విజయరాఘవన్, బి. వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయరాఘవన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దేశ వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నదని విమర్శించారు. ఫలితంగా రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. రైతాంగ పోరాటంతో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ దొడ్డిదారిలో అవే విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను రద్దు చేసి,నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులను కట్టుబానిసలుగా మార్చాలని చూస్తున్నదనీ, మత విద్వేషాలను సృష్టిస్తూ ప్రజల దృష్టిని మళ్లించజూస్తున్నదని తెలిపారు. ప్రజావ్యతిరేక చర్యలను క్యాంపెయిన్ ద్వారా గ్రామ గ్రామ స్థాయివరకు తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో సదస్సులను నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యకాస రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, పద్మ, నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, పొన్నం వెంకటేశ్వరరావు, ఆర్ ఆంజనేయులు, తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి టి సాగర్, ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, నున్న నాగేశ్వరరావు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, నాయకులు జె వెంకటేశ్, ఎస్ రమ, బి మధు, ఏజే రమేష్, వంగూరు రాములు, వై.సోమన్న, పి శ్రీకాంత్, ఎ సునీత తదితరులు పాల్గొన్నారు.