Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ నాయకులుగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆమెకు సంబంధం లేని విషయం (ఎంపీ అరవింద్ వ్యవహారం)లో గవర్నర్ జోక్యం చేసుకోవడం సమంజసం కాదని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో గవర్నర్‌ను ఉపయోగించి బీజేపీ రాజకీయం చేస్తున్నదని పేర్కొన్నారు. అదే తరహా రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలోనూ మొదలుపెట్టారని వాపోయారు. సమస్యను పరిష్కరించాలి తప్ప కక్షపూరితంగా వ్యవహరించడం గవర్నర్‌కు తగదనీ, అలాంటి వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ జాతీయ మహాసభ పిలుపునిచ్చిందని తెలిపారు. ఆ తరహాలోనే రానున్న కాలంలో ఆ వ్యవస్థ రద్దుకై ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల ఏడున చలో రాజ్‌భవన్ పిలుపునిచ్చామని తెలిపారు. ఇప్పటికే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సీబీఐ, ఐటీని ప్రయోగించి ప్రతిపక్షాలపై చేస్తున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కేంద్రం రాష్ట్రాలకు సహాయకారిగా ఉండి దేశ సమగ్రత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. బీజేపీ మతోన్మాద, ఫాసిస్టు విధానాలను ఎండగట్టేందుకు ప్రగతిశీల, లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులతో కలిసి పోరాడుతామని తెలిపారు.