Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిపై వేటు పడింది. పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరిస్తూ టీపీసీసీ తీర్మానించింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సమావేశమైన టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఈమేరకు శనివారం నిర్ణయం తీసుకుంది.శశిధర్రెడ్ది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ క్రమశిక్షణా సంఘం చైర్మెన్ జి చిన్నారెడ్డి వెల్లడించారు. అయితే శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు వార్తలొస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, సీనియర్ నేత డీకే అరుణతో కలిసి ఆయన శుక్రవారం రాత్రి కేంద్రమంత్రి అమిత్‌షాతో ఢిల్లీలో సమావేశమైన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా అక్కడ ఉన్న ఆయన... పలువురు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు టీపీసీసీ నేతలు తేల్చారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారుతున్నట్టు వచ్చిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఢిల్లీకి రావడం కొత్తేమీ కాదనీ, మనవడి స్కూల్ ఫంక్షన్లో పాల్గొనడానికి వచ్చానని తెలిపారు. 'నేను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నా. రిటైర్డ్ కాలేదు. నేను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారు. బీజేపీలో చేరడానికే నేను ఢిల్లీకి వచ్చానన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు' అని వెల్లడించారు.