Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తక్షణ మరమ్మతులు, నిరంతర నిర్వహణతో రోడ్లు అద్దంలా మెరవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను కోరారు. పంచాయతీరాజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ, అదనపు నిధులకు సీఎం కేసీఆర్ హామి ఇచ్చినట్టు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ల వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. పదోన్నతులకున్న ఇబ్బందులు తొలిగాయనీ, డిసెంబర్ ఆరు నాటికి కొత్త ఎస్.ఈ కార్యాలయాలు ఏర్పాటవుతాయని తెలిపారు. డిసెంబర్ 15 నాటికి రోడ్ల మరమ్మతుల టెండర్లు పూర్తి కావాలని ఆదేశించారు. రూ.3,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ, వచ్చే ఏడాది పనులు, నిధుల ప్రతిపాదనలు కూడా తయారు చేయాలని కోరారు. వరదనీటితో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు, నిర్వహణకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ప్రతి మూడు నెలలకు అటవీ భూముల్లో రోడ్ల నిర్మాణంపై ఈఎన్సీ సమీక్షిస్తారని చెప్పారు.రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత పెంపు కోసం విదేశాల్లో అధ్యయనం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానీయా తదితరులు పాల్గొన్నారు.