Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళి అర్పించిన పార్టీ జిల్లా నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మేకల రాయమల్లు(70) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బాబు క్యాంప్‌లో శనివారం మృతిచెందారు. ఆయన మృతికి సీపీఐ(ఎం) నాయకులు సంతాపం తెలియజేశారు. రాయమల్లు మృతదేహానికి పార్టీ సీనియర్ నాయకులు గుగులోత్ ధర్మ ఎర్రజెండా కప్పి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మేకల రాయమల్లు విద్యార్థి దశ నుండే పార్టీలో చురుకైన కార్యకర్తగా పని చేశారు. సింగరేణిలో సీఐటీయూ నాయకుడిగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పని చేశారు. తుది శ్వాస వరకు సీపీఐ(ఎం)లో కొనసాగి అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. ఆయన ప్రజాశక్తి దినపత్రిక, నవతెలంగాణ దినపత్రిక అభివృద్ధికి పాటుపడ్డారు. చాలా కాలంగా ఏజెంటుగా సేవలందిస్తున్నారు.
నేడు అంతక్రియలు
కామ్రేడ్ మేకల రాయమల్లు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కొత్తగూడెం బాబు క్యాంప్‌లో అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, రాయమల్లు సహచరులు, అభిమానులు అందరూ తప్పకుండా పాల్గొనాలని పార్టీ నేతలు కోరారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, పట్టణ కమిటీ సభ్యులు డి.వీరన్న, నందిపాటి రమేష్, సీనియర్ నాయకులు గాజుల రాజారావు, కూరపాటి సమ్మయ్య, ఎంఎస్.ప్రకాష్, బిక్కులాల్ తదితరులు ఉన్నారు.