Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'బ్రేకింగ్ బ్యారియర్స్' ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ సభలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సమాజాన్ని పరిశోధించి, పరిష్కారాలు సూచిస్తూ, సామాజిక న్యాయాన్ని అభిలషించే గొప్ప వ్యక్తి కాకి మాధవరావు అని పలువురు వక్తలు ప్రసంసించారు. సమాజాన్ని భిన్న కోణాల్లో విశ్లేషిస్తూ, అట్టడుగు వర్గాలకు అంతిమన్యాయం అందించడమే మార్పుకు మార్గమని ఆయన విశ్వసిస్తారని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు రాసిన ఆయన స్వీయ జీవిత చరిత్ర 'బ్రేకింగ్ బ్యారియర్స్' పుస్తకాన్ని శనివారంనాడిక్కడి ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవన సముదాయంలో రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ వై వేణుగోపాలరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమార్పుకు కాకి మాధవరావు కృషి చేశారనీ, ఆయన అనుభవాలతో కూడిన ఈ పుస్తకం భావితరాలకు మార్గదర్శిగా ఉపయోగపడుతుందని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ పుస్తక పరిచయం చేస్తూ, సమాజంపై ఉన్న కుల ప్రభావం, అవరోధాలను అధిగమించి విధినిర్వహణను అనుకూలంగా మలుచుకున్న నేర్పరి అని ప్రసంసించారు. జీవిత చరిత్రలో వ్యక్తిగత అంశాలకంటే, తన ఆలోచనల్ని సమాజంతో పంచుకోవాలనే జిజ్ఞాస కనిపిస్తుందన్నారు. సీనియర్ పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ కాకి మాధవరావు వరంగల్‌లో పనిచేసేటప్పుడు నక్సలైట్లు సమాజంలో అట్టడుగు వర్గాల వారికోసం పనిచేస్తారనే కోణంలో ఆయన్ని 'నక్సలైట్ కలెక్టర్' అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్డ్ అయ్యాక ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ కోసం సీపీఐ(ఎం)తో కలిసి ప్రజాక్షేత్రంలో పనిచేశారని చెప్పారు. సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ ప్రజల పట్ల అకుంఠిత నమ్మకం, వారికి మేలు చేయాలనే తపన ఉన్న అధికారితో కలిసి పనిచేయడం తమకో మంచి అనుభూతి అని చెప్పారు. అధికారులంటే తృణీకరించే తమలాంటి ఉద్యమకారులు కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తిత్వం విశిష్టమైనదని అన్నారు. సమాజం మేలు కోసం ఆయన నుంచి ఇలాంటి మరిన్ని పుస్తకాలు రావాలని అభిలషించారు. రచయిత కాకి మాధవరావు మాట్లాడుతూ తన తల్లిదండ్రులు నిరక్షరాస్యులైన వ్యవసాయ కూలీలు అని చెప్పారు. అలాంటి కుటుంబం నుంచి తాను ఐఏఎస్‌కు ఎదిగిన క్రమాన్ని సభికులతో పంచుకున్నారు. విధినిర్వహణలో తనకు ఎదురైన రాజకీయ వత్తిళ్లు, సామాజిక, సాంఘీక అసమానతలను గుర్తుచేసుకున్నారు. ఎమ్మెస్కో ప్రచురణకర్త విజయకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, గోవు శ్యామల, ప్రదీప్‌చంద్ర, వరంగల్ మాజీ ఎస్పీ భాస్కరరావు, జస్టిస్ చంద్రయ్య, ఆచార్య ఇనాక్, ప్రొఫెసర్ మురళీమనోహర్, సీఎస్ రెడ్డి తదితరులు మాట్లాడారు. పలువురు సీనియర్, రిటైర్ట్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.