Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డులు.. ఆన్‌లైన్‌తో తిప్పలు
- ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎక్కువగా పనులు
- నేడు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర మహాసభ
- భువనగిరిలో ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ-మిర్యాలగూడ
''ఏం ఉద్యోగమో ఏమో కానీ.. ఇన్ని.. అన్ని కష్టాలా.. ఉదయం నిద్ర లేచిన నాటి నుంచి.. రాత్రి నిద్రపోయేవరకు టెన్షన్.. ఎప్పుడు.. ఏ రిపోర్ట్ ఇవ్వమంటారో అని భయం.. కొత్తగా ఇచ్చిన స్మార్ట్ పోన్ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అన్ని నివేదికలు ఆన్లైన్లో నమోదు చేయాలి. ఆన్‌లౌన్ నమోదు కష్టంగా మారింది. ఆపై సెంటర్లో పోషక ఆహారం పంపిణీ.. రివార్డులో నమోదు.. ఆపై ఆన్లైన్ చేయటం.. నిత్యం స్మార్ట్ పోనేతో.. పైగా బిఎల్ఓ, పల్స్ పోలియో, ఇతర ప్రభుత్వ డ్యూటీలతో సతమతమౌతున్నాం.. ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువుగా అన్ని పనులూ చేస్తున్నాం.. ఇన్న చేసినా ప్రజాప్రతినిధుల ఒత్తిడిలు.. అధికారుల వేధింపులు తట్టుకోలేక పోతున్నాం. రోజూ మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఉద్యోగం మాకు వద్దు.'' ఇదీ ఓ అంగన్వాడీ టీచర్ ఆవేదన.
ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లందరి మనోవేదన ఇదే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొనసాగే అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోంది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో కొనసాగే ఈ వ్యవస్థలో కేంద్రం ఇచ్చే నిధులను కోత పెడుతోంది. నిధులు ఇవ్వకుండా మొత్తం రాష్ట్రంపైనే నెట్టుతోంది. సెంటర్లకు పంపిణీ చేసే పోషకాహారం నాసిరకంగా ఉండటం వల్ల లబ్దిదారుల నుంచి అంగన్వాడీ వర్కర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్గో, రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయడంతో వాటిని తెచ్చుకునేందుకు సిబ్బంది నానా కష్టాలు పడుతున్నారు. పైగా టీఏ, డీఏ లు కూడా ఇవ్వడం లేదు. వీరితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నా కనీస వేతనం అమలు చేయడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తిస్తారని ఆశతో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. పని పెంచుతున్నారు తప్ప, వేతనం పెంచడం, ఉద్యోగ భద్రత కల్పించటం కనిపించడం లేదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, మొత్తం 35,700 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 3989 మినీ అంగన్వాడీ సెంటర్లు. సుమారు 71,400 మంది టీచర్లు, ఆయాలు పని చేస్తున్నారు. వీటి పరిధిలో గర్భిణీలు, బాలింతలు 4,57,643 మంది, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వయసు గల పిల్లలు 10,34,562 మంది, మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలు 6,67,783 మంది ఉన్నారు. వీరందరికీ అంగన్వాడీ వర్కర్స్ సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18 ప్రాజెక్టులు ఉండగా, 4203 సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 4400 మంది వర్కర్లు పని చేస్తున్నారు.
వర్కర్లు అందించే సేవలు..
అంగన్వాడీ టీచర్ పోషక ఆహారం పంపిణీ, రికార్డులు నమోదు చేయాలి. గర్భిణీలు, పిల్లల బరువు, ఎత్తు, గ్రోత్ ప్రతి నెలా చేస్తుంటారు. కొత్తగా ఇచ్చిన సెల్ ఫోన్లో గ్రోత్, లబ్దిదారుల రిజిస్ట్రేషన్, టీహెచ్ఆర్ వంటి పనులు చేస్తున్నారు. బాలింతలు, గర్భిణీలకు పోషక ఆహారం అందించాలి. వారికి ఆరోగ్య సూచనలు అందించాలి. ఆరోగ్య పరిస్థితిపై నిత్యం పర్యవేక్షించి సూచనలు సలహాలు ఇవ్వాలి. వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించి వారు ఆరోగ్యంగా ఉండే విధంగా బాధ్యత తీసుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విరామం లేకుండా విధులు నిర్వహిస్తున్నార. పిల్లలను ఆటపాటలతో అలరించాలి. పైగా ప్రభుత్వ కార్యక్రమాలను వీరితోనే చేయిస్తూ ఉంటారు. ఆల్బెండజెల్ మందుల.. బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో మీరు ముందు భాగం ఉండి విధులు నిర్వహిస్తున్నారు. పైగా బిఎల్ఓగా విధులు నిర్వహిస్తూ ఓటర్ జాబితాలో సిద్ధం చేస్తూ ఉంటారు. పల్స్ పోలియో విధులు కూడా వీరితోనే చేయిస్తున్నారు.
నేడు, రేపు రాష్ట్ర నాలుగో మహాసభ
ఈనెల 20 21 తేదీల్లో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభ భువనగిరిలో జరగనుంది. మున్సిపల్ పరిధిలోని రాయగిరి గ్రామంలో సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఈ మహాసభ జరగనుంది. ఈ మహాసభకు తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం, అన్ని జిల్లాల నుంచి సుమారు 400 మంది అంగన్వాడీ వర్కర్లు ప్రతినిధులుగా హాజరు కానున్నారు. అంగన్వాడీల సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపి వాటి పరిష్కారం కోసం చేపట్టబోయే ఉద్యమాల గురించి కార్యాచరణ రూపొందించను న్నారు. అంగన్వాడీల కష్టాలు, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నూతనంగా ఏర్పడే రాష్ట్ర కమిటీ కృషి చేయనుంది. ఈ మహాసభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.