Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు రోజులుగా భారీగా ట్రాఫిక్ జామ్
- ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో రోడ్లు మూసివేత
- ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచన
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి ఎన్టీఆర్ మార్గ్, మింట్ కంపౌండ్ వైపు రాకపోకలను బంద్ చేశారు. ఈ ఆంక్షలు 20వ తేదీ(నేడు) రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఫార్ములా ఈ రేస్‌లు నెక్లెస్ రోటరీ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ఓల్డ్ సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కంపౌండ్ మీదుగా ఐమాక్స్ వరకు కొనసాగుతుంది. దాంతో మూడ్రోజుల నుంచి భారీగా ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. నగరంలో సాధారణంగానే భారీగా ట్రాఫిక్ ఉంటుందని, అయినా.. ప్రభుత్వం నగరం నడిబొడ్డులో ఫార్ములా రేస్‌లకు ఎలా అనుమతిస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, ట్రాఫిక్ పోలీసులు మాత్రం వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా
-వీవీ విగ్రహం(ఖైరతాబాద్) వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. వీవీ విగ్రహం వద్ద షాదాన్ కాలేజ్, రవీంద్రభారతి వైపు మళ్లిస్తున్నారు.
-బుద్దభవన్, నల్లంపట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తున్నారు.
-రసూల్‌పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు అనుమతిస్తున్నారు.
-ఇక్బాల్ మినార్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు అనుమతి లేకపోవడంతో వాహనాలు ఫ్లై ఓవర్‌పై నుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్తున్నాయి.
-ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు.
-బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్మినార్, రవీంద్ర భారతి జంక్షన్‌కు మళ్లించారు.
-ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్‌కంపౌండ్ వైపు వాహనాలను అనుమతి లేకపోవడంతో వాహనాలను రవీంద్ర భారతి జంక్షన్ వైపు అనుమతిస్తున్నారు.
-ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంతం వైపు నుంచి ప్రింటింగ్ ప్రెస్, నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతిని నిరాకరించారు. ఈ దారిలో వచ్చే వాహనాలను రాజ్‌దూత్ లైన్లోకి మళ్లిస్తున్నారు. ఇదిలావుండగా అఫ్జల్‌గంజ్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్, బీబీఆర్ మిల్స్, కవాడిగూడ రూట్ల నుంచి అనుమతిస్తున్నారు.