Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిసారి హైదరాబాద్ రోడ్లపై ఇండియన్ రేసింగ్
- జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- నెక్లెస్‌రోడ్డులో 2.7 కిలోవిూటర్ల ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు
- మొత్తం 24 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోవిూటర్ల ప్రత్యేక ట్రాక్‌లో గంటకు 300 కిలోవిూటర్ల వేగంతో కార్లు దూసుకెళ్లాయి. భారత్‌లో నిర్వహిస్తున్న తొలి స్ట్రీట్ సర్క్యూట్ కాగా.. ఇందులో హైదరాబాద్‌లో జరుగుతుండడం విశేషం. రేస్‌లో మొత్తం 24 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు పాల్గొనగా.. హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ శనివారం జెండా ఊపి లీగ్‌ను ప్రారంభించారు. అనంతరం లీగ్‌ను వీక్షించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరై రరు రరు మంటూ దూసుకెళ్లిన కార్లను చూసి కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ఫార్ములా ఈ రేసు దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సహా ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఆరు జట్ల నుంచి 12 కార్లు.. 24 మంది డ్రైవర్లు రేస్‌లో ఉన్నారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ నుంచి నగరానికి చెందిన ప్రముఖ ఫార్ములా రేసర్ కొండా అనిందిత్ రెడ్డి బరిలో ఉన్నాడు. ఈ పోటీలను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ... అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నాయి. లీగ్ ఫార్మాట్ ప్రకారం పోటీలు 4 రౌండ్లలో జరగనున్నాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ రౌండ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుండగా.... 2, 3 రౌండ్లు చెన్నైలో కొనసాగనున్నాయి. ప్రతి రౌండ్ రెండ్రోజుల పాటు జరగనుంది. ఈ రోజు పోల్ పొజిషన్ కోసం క్వాలిఫయింగ్ రేస్ జరగనుండగా... ఆదివారం 3 స్ప్రింట్ రేసులు నిర్వహించనున్నారు. మూడు స్ప్రింట్ రేసుల్లో టాపర్‌గా నిలిచిన జట్టుకు 25 పాయింట్లు లభిస్తాయి. రెండో స్థానంలోని జట్టుకు 18, మూడో స్థానంలోని టీమ్ కు 15 పాయింట్లు లభిస్తాయి. రేసింగ్ కోసం..2 కిలోవిూటర్ల 800 విూటర్ల మేర ట్రాక్ ఏర్పాటు చేశారు. స్ట్రీట్ సర్క్యూట్ రూట్ చుట్టూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాక్‌లో మొత్తం 17 మలుపులున్నాయి. ఐమాక్స్ కూడలిలోని ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద ప్రారంభమై తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర యూటర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి ఎన్టీఆర్ పార్క్‌లో ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్ విూదుగా ఐమాక్స్ ముందు నుంచి మళ్లీ ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు చేరుకోవడంతో ఒక రౌండ్ పూర్తవుతుంది. ఈ విధంగా మూడు స్పింట్స్లో తొలి మూడు స్థానాల్లో నిలిచే జట్లకు పాయింట్లు కేటాయిస్తారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో వాడుతున్న కార్లు సింగిల్ డ్రైవర్ మోడల్‌వి. సామర్థ్యం, డిజైన్ల విషయంలో ఇవి ఈ-3 రేసుల్లో ఉపయోగించే కార్లను పోలి ఉంటాయి. ఇవి గంటకు 250 కిలోవిూటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ కార్లు దాదాపు 380కిలోల బరువు ఉంటాయి. వీటిని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోల్ఫ్ తయారు చేసింది.