Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభానికి నోచని వరి కొనుగోలు కేంద్రాలు
- ప్రయివేటు వ్యాపారులకు ధాన్యం విక్రయాలు
నవతెలంగాణ - శాయంపేట
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించడానికి వచ్చిన రైతులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాతావరణ మార్పుల హెచ్చరికలతో చేసేదేమీ లేక ప్రయివేటు మిల్లర్లకు నష్టానికి ధాన్యం అమ్ముకుంటున్నారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండలానికి ఐకేపీ ఆధ్వర్యంలో 5 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు కాగా, పీఏసీఎస్ ఆధ్వర్యంలో మరో 5 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అధికారులు కేటాయించారు. గ్రామాల్లో ఇప్పటికే వరి కోతలు పూర్తి కావడంతో వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబెట్టుకుంటున్నారు. ముందుగా కోత వేసిన ధాన్యం తూకానికి సిద్ధమైనప్పటికీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పడిగాపులు పడాల్సి వస్తుంది. వాతావరణ హెచ్చరికల ఆధారంగా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి ముద్దవుతుందని భయంతో కొంతమంది రైతులు ధర తక్కువ అయినప్పటికీ ప్రయివేటు మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2060, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2040 మద్దతు ధర చెల్లిస్తుండగా, ప్రయివేటు వ్యాపారులు కేవలం క్వింటాకు రూ.1900 ధర చెల్లిస్తూ రైతాంగాన్ని దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తమ కష్టాలు తొలగించాలని రైతులు వేడుకుంటున్నారు.
ప్రయివేటు మిల్లర్లను ఆశ్రయించాల్సి వస్తుంది
గ్రామంలో ఇప్పటికే 75 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. 18 రోజుల నుంచి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబెట్టుకున్న. వారం రోజుల నుంచి పీఏసీఎస్ సిబ్బందిని అడగగా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నరు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదు. గత్యంతరం లేక ఐదున్నర ఎకరాల్లో పండించిన 120 క్వింటాళ్ల ధాన్యాన్ని నష్టం అయినప్పటికీ ప్రయివేటు మిల్లర్లకు విక్రయించుకున్న.
- ఓరుగంటి గోపాల్ రెడ్డి, రైతు, మైలారం