Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధిపత్య భావజాలంపై విజయ బావుటా...
- సంబురంగా సాహిత్య సంరంభం
- ఘనంగా 'తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్ -2022' ప్రారంభం
- వికృత రాజకీయాలపై పాట గర్జించాలి..
- కుల, మతోన్మాదాలను తెగ నరకాలంటూ ఫెస్ట్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'పాట ఓ బతుకు బాట.. అది విప్లవానికి తూటా.. ఆధిపత్య భావజాలంపై ఎగిరే విజయబావుటా...' అని పలువురు వక్తలు ఉద్బోధించారు. మనిషిలోని భావోద్వేగాలన్నింటినీ ఒడిసిపట్టి... వాటికి అక్షర రూపమిస్తే అది పాటనే అమృతాన్ని పంచుతుందని వారు వ్యాఖ్యానించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నుంచి రగుల్ జెండా వరకూ... అన్నమాచార్యుని కీర్తనల నుంచి అమరవీరుల దాకా ప్రతీ సందర్భాన్నీ, సన్నివేశాన్ని అది స్పృశిస్తుందని వారు వివరించారు. పాట అనేది జోలపాడేడి.. నిద్ర పుచ్చేది మాత్రమే కాదనీ, అది చైతన్యాన్ని నింపేది.. తను ముందుకు నడుస్తూ సమాజాన్ని నడిపించేదని విశ్లేషించారు. పుట్టిన శిశువుని ఉయ్యాలలో వేసే రోజు నుంచి ఆ మనిషి చనిపోతే ఊరేగింపుగా శ్మశాన వాటికకు తీసుకుపోయేదాకా నిత్యం, అనునిత్యం మన వెంట ఉండి మంచీ, చెడులను ఉద్బోధించేది పాటని విశదీకరించారు. ఇంట్లో ప్రతీ మనిషికో స్మార్ట్ ఫోనున్న ఈ కాలంలో కూడా కోట్లాది మందిని కార్యోన్ముఖులను చేస్తూ.. వారిలో ఉద్వేగాన్నీ, ఉత్సాహాన్నీ నింపేది పాటేనని వారు విడమరిచి చెప్పారు. కుల మతోన్మాద జాఢ్యాలు జడలు విప్పుతున్న ప్రస్తుత తరుణంలో వాటి బారి నుంచి సమాజాన్ని కాపాడేందుకు వీలుగా నిజమైన, నిఖార్సైన ప్రజా పాటల్ని రాయాలని వారు పిలుపునిచ్చారు. అందుకోసం కృషి చేయాలని కవులు, రచయితలు, సాహితీవేత్తలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ సాహితీ ఆధ్వర్యాన పాటకు జేజేలు పేరిట 'లిటరరీ ఫెస్ట్-2022'ను ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభించారు. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్థన్ పతాకావిష్కరణ చేయగా... అనంతరం నిర్వహించిన ప్రారంభ సభకు తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షత వహించారు. ఆదిమ కాలం నుంచి నేటి వరకూ పాట పుట్టిన విధానాన్ని, ఇంతింతై వటుడింతే అన్నట్టు అది పెరిగిన వైనాన్ని ఫెస్ట్ సోదాహరణంగా వివరించింది. మనిషి అనుభవాలు, జ్ఞాపకాలు, సంవేదనల నుంచే పాట పుడుతుందనీ, అలా పుట్టిన పాటల్లో జీవం తొణికిసలాడుతుందని తెలిపింది. ఈ క్రమంలో విడివిడిగా ఉన్న పవ్వులను ఒక చోట చేర్చి బతుకమ్మగా పేర్చినట్టు... భిన్నమైన భావాల నుంచి పాటలు ఉద్భవించాలని సూచించింది. సమాజాన్ని భిన్న కోణాల్లో ఆవిష్కరించాలనుకునే కవులు, రచయితలు... కార్మికులు, కర్షకులు, కష్టజీవుల బతుకులను దగ్గర్నుంచి చూడాలని కోరింది. అప్పుడు పాట తనంతట తానే తన్నుకుని వస్తుందని పేర్కొంది. అలాంటి పాటకు ఉద్విగత, విభిన్నత చేకూరుతాయని తెలిపింది. ఇదే సమయంలో కాలానుగుణంగా పాటను ఆధునీకరించాలి.. విప్లవీకరించాలని సూచించింది. సమాజంలో, సాహిత్యరంగంలో విభిన్న ప్రక్రియలు, అనేక మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో సైతం పాట తన ప్రత్యేకతను చాటుకుంటూ, ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నదని విశదీకరిచింది. దేశంలో వికృత రాజకీయాలు విచిత్ర విన్యాసాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పాట వాటిపై సమరశంఖం పూరించాలని కోరింది. కుల, మతోన్మాద జాఢ్యాలను తెగ నరకాలంటూ ఆకాంక్షించింది. చైతన్యపరిచే పాటల ద్వారా యువ కవులు మతమనే మత్తు మందుకు విరుగుడు వ్యాక్సిన్‌ను కనిపెట్టాలని అభిలషించింది. ఫెస్ట్‌కు హాజరైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న 'కమ్యూనిజం'పై పాట పాడి... సభికులను ఉర్రూతలూగించగా, ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ 'నాగలీ కళ్లలో కన్నీరెందుకో...' అంటూ జనం కళ్లలో నీళ్లు తెప్పించారు. కవి యాకూబ్... 'వస్తున్నయి.. వస్తున్నయి.. జగన్నాథ రథ చక్రాలొస్తున్నరు...' అంటూ సాహితీ వేత్తలను కార్యోన్ముఖులను చేయగా... 'గుండెలోని గాయాలు.. మండించే గేయాలు..వేదనలై.. శోధనలై రగలాలి విప్లవాలు...' అంటూ పాడటం ద్వారా సుప్రసిద్ధ పాత్రికేయులు తెలకపల్లి రవి విప్లవ శంఖాన్ని మోగించారు. తద్వారా తెలంగాణ నుంచే గాక ఆంధ్రా, కర్నాటక రాష్ట్రాల నుంచి తరలొచ్చిన యువ, నవ కవులు, రచయితలు, సాహితీవేత్తలకు లిటరరీ ఫెస్ట్ ఒక నూతన దశను, దిశను నిర్దేశించింది. వర్తమాన పరిస్థితుల్లో దేశాన్ని, ప్రజల్ని రక్షించేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తూ దాని ప్రారంభ సభ కొనసాగింది.