Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోడ రాతలు, పోస్టర్లతో ముమ్మర ప్రచారం
- నూతన విద్యావిధానంపై చర్చాగోష్టులు, సెమినార్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జాతీయ 17వ మహాసభలు డిసెంబర్ 13 నుంచి 16 వరకు హైదరబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న నేపథ్యంలో మహాసభల ఆహ్వానసంఘం విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నగరంలో ప్రాంతాల వారీగా గోడరాతల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్ఎఫ్ఐ మాజీ కార్యదర్శి, ఆహ్వాన సంఘం కో-చైర్మెన్ ఎం శ్రీనివాస్ తెలిపారు. మరి కొన్ని ప్రాంతాల్లో గోడరాతలు ప్రారంభించారు. విద్యార్థి ఉద్యమాల పురిటి గడ్డ, చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ సభలకు వేదిక కానున్న నేపథ్యంలో పరిసర ప్రాతాంల్లో మరింత ఎక్కువగా పోస్టర్లతోపాటు, వివిధ రూపాల్లో అలంకరణ చేపట్టేందుకు కృషి జరుగుతున్నది. ఆహ్వానసంఘం నిర్వహిస్తున్న ప్రచారంతో పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ప్రచారం జరుగుతున్నది. సోషల్ మీడియా ద్వారా ఎస్ఎఫ్ఐ లక్ష్యాలను విద్యార్ధుల్లోకి తీసుకెళ్తూనే..ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో మహాసభల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నది. సుమారు 1.50 లక్షల పోస్టర్లు, లక్ష కరపత్రాలతో ప్రతి విద్యార్థి, ప్రతి ఇంటికి సభల సందేశం అందించాలనే లక్ష్యంతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
మహాసభల నిర్వహణ కోసం 8 ఉప కమిటీలు..
మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో మరో ఎనిమిది ఉపకమిటీలను వేసింది. ప్రచార కమిటీ మొదలు..బహిరంగ సభ, మహాసభలు, ఫుడ్కమిటీ ఇత్యాది ఎనిమిది కమిటీలను సుమారు 100 మంది ముఖ్యమైన కార్యకర్తలు ఆయా కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లెనిన్, సభ్యులు శ్రీమాన్ శివకుమార్, శివ తదితరులు వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు అంటించే కార్యక్రమాన్ని చేపట్టారు.
అవగాహన సదస్సులు..
నూతన విద్యావిధానం-దాని పర్యవసనాలు అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యాలయాలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి విద్యాసంస్థల్లో లక్షమంది విద్యార్థుల వద్దకెళ్లారు. పలు కళాశాలల్లో నిర్వహించే సెమినార్లకు ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థి సంఘం జాతీయ నేతలు పాల్గొననున్నట్టు తెలిసింది. అధ్యయనం, పోరాటం లక్ష్యంతో 50ఏండ్లుగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ పోరాడుతున్న తీరును విద్యార్థులకు వివరిస్తున్నారు.
విశేష స్పందన..
బంధువులు, అమ్మానాన్నలు ఇచ్చిన డబ్బులను గల్లగురుగుల్లో దాసుకున్న డబ్బులను విద్యార్థులు ఎస్ఎఫ్ఐ మహాసభల నిర్వహణ కోసం ఇస్తున్నారు. ఇతర విద్యార్థులకు ఇది ప్రేరణగా నిలుస్తున్నది. ఈ రకంగా ఎస్ఎఫ్ఐ జాతీయ17వ మహాసభలకు రాష్ట్రంలోని విద్యార్థుల నుంచి విశేష స్పందన వస్తున్నదని ఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు.