Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంపొదిస్తున్నాం
- బీజేపీ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతుల ప్రారంభంలో బండి సంజయ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అధికారం కోసం అడ్డదారులు తొక్కాలనుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఏకాత్మ మానవతావాదమే తమ పార్టీ మూల సిద్ధాంతమన్నారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసమే శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్‌లో బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...14 అంశాలపై శిక్షణా తరగతుల్లో చర్చించబోతున్నట్టు తెలిపారు. బీజేపీ పార్టీ చరిత్ర, భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి పలువురు ప్రముఖులు వివరించనున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో క్రమంగా పార్టీని బలోపేతం చేసుకుంటు న్నామన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. టీఆర్ఎస్ తొండి ఆటపై పోరాడి అధికారంలోకి వస్తామన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడబోమనీ, దొంగే దొంగ అన్నట్టుగా టీఆర్ఎస్ పాలన ఉందని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ సంస్థాగత రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్, ఎంపీలు డి.అర్వింద్‌కుమార్, సోయం బాపూరావు, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగిలేటి సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్‌రెడ్డి, జి.వివేక్, జి.మోహన్‌రావు, ఎమ్మెల్యే జి.రఘునందన్‌రావు, ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శృతి, తదితరులు పాల్గొన్నారు.
హింస కేసీఆర్‌కు ప్రవృత్తిగా మారింది : తరుణ్‌చుగ్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హింస ప్రవృత్తిగా మారిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. శామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అహంకారంతో కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్ ఇంటిపైకి కిరాయి గూండాలను పంపి దాడి చేయడం దుర్మార్గమన్నారు. మూడు రోజులపాటు శిక్షణా తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంతో పాటు 14అంశాలపై శిక్షణా తరగతుల్లో చర్చిస్తున్నారని చెప్పారు. సమావేశాల చివరి రోజు బీజేపీ కార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు.