Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
బ్రేకులు ఫెయిలై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్ట సమీపంలో ఆదివారం జరిగింది. ఘటన విషయం తెలుసుకున్న ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రయాణికులను పరామర్శించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ డిపోకు చెందిన బస్సు వికారాబాద్ నుంచి ధరూర్ జాతరకు వెళ్తుంది. జాతరకు స్పెషల్ బస్సు కావడంతో సుమారు 72 మంది ప్రయాణికులు ఎక్కారు. అనంతగిరి ఆలయం దాటి కొద్ది దూరం వెళ్లగానే బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కేరెల్లి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో సికింద్రాబాద్ రసూల్పూరకు చెందిన స్వరూప (37) బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాంతో పాటు ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో స్వల్పగాయాలయ్యాయి. కండిషన్ లేని బస్సులు రూట్లపై వేసి ప్రయాణికుల ప్రాణాలతో చెలగటం ఆడుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ డిపోలో ఒకట,ి రెండు బస్సులు తప్ప ఎక్కువ బస్సులు కండిషన్లో లేవని, వెంటనే అధికారులు స్పందించి బస్సులను పునరద్దరించాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగటం ఆడొద్దని కోరారు. ఘటనపై పూర్తి విచారణ చేపడుతామని ఎంపీ, ఎమ్మెల్యే ప్రయాణికులకు హామీ ఇచ్చారు.