Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నా గురువు వల్లే ఈ స్థాయికి : డా|| చుక్కా.రామయ్య
- పాలకులను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు జీవం పోసిన వ్యక్తి రామయ్య :జస్టిస్ సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ ఓయూ
తాను ఎప్పుడూ ప్రజా మనిషినేనని, పాఠశాల భోధనే కాకుండా దేశం కోసం ఆలోచించి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని డా|| చుక్కా రామయ్య టీచర్లకు సూచించారు. ఆయన 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యాకేంద్రంలో చుక్కా రామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్టు రామచంద్ర మూర్తి అధ్యక్షతన జరిగిన '80 ఏండ్లకు పైగా ప్రజా ఉద్యమ ప్రస్థానం'పై విద్యా గోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన గురువు నమ్మాళ్ స్వామి వల్లే తాను ఇలా ఉన్నానని, ఇంకా దేశానికి సేవలు అందిస్తానని చెప్పారు. తన కోసం వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ప్రశ్నయే శ్వాస అని, సమాజంలో ఉన్న స్తబ్ధత, నిశ్శబ్దమే ప్రజాస్వామ్య పతనానికి దారి తీస్తుందన్నారు. ప్రశ్నించేతత్వం, రాజ్యాంగ సంవిధాన విలువలకు రామయ్య నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. పాలకులను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు జీవం పోసిన వారి జీవన ప్రయాణం, ప్రజా ఉద్యమాలు, రేపటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. కండ్ల ముందు కనిపిస్తున్న అసమానతలు, అనైతిక విధానాలపై మౌనం విడకపోతే దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు చైర్మెన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు, మావోయిస్టులు, తెలంగాణ ఇలా మూడు ఉద్యమాల్లో పాల్గొన్న గొప్ప వ్యక్తి రామయ్య అని, ఆయన పుట్టినరోజు తెలంగాణ ఉద్యమ జన్మదినమని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు ఆర్.ఆనంద భాస్కర్, కె.శ్రీనివాస్, సీఎం సీపీఆర్ఓ జ్వాల నరసింహారావు, లక్ష్మారెడ్డి, దయాకర్, రవీందర్, సారంగపాణి, తదితరులు పాల్గొని ప్రసంగించారు.