Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యతలు చేపట్టిన తెలంగాణ న్యాయమూర్తుల సంఘం నాయకులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొత్తగా ఎన్నికైన తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, హౌసింగ్ సొసైటీ నాయకులు నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఆదివారం తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, తెలంగాణ న్యాయమూర్తుల హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని హౌటల్ అబొడ్లో న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు న్యాయశాఖ కార్యదర్శి నందికొండ నరసింగరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నూతన కమిటీలు బాధ్యతలు స్వీకరించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సంఘం న్యాయమూర్తుల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా న్యాయమూర్తులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు సత్వర న్యాయం అందించేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. న్యాయమూర్తులకు సొంత ఇల్లు సాధించే దిశగా హౌసింగ్ సొసైటీ పనిచేస్తుందన్నారు. అనంతరం పాత అసోసియేషన్ అధ్యక్షులు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జి. రాజగోపాల్, ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్, కార్యవర్గ సభ్యులను నూతన సంఘం ప్రతినిధులు సన్మానించారు.
న్యాయమూర్తుల సంఘం నూతన కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీమోహన్ మాట్లాడుతూ న్యాయమూర్తుల సంఘం ముందు ఉన్న కర్తవ్యాలను వివరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తుల సంఘం ఉపాధ్యక్షులు కె. ప్రభాకర్‌రావు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు జి.సుదర్శన్, హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్, న్యాయమూర్తుల సంఘం, నాయకులు కుంచాల సునీత, ప్రతిమ డాక్టర్ పట్టాభిరామారావు, దశరధ రామయ్య, జై ఉపేందర్ రావు, శ్రీవాణి, మండ వెంకటేశ్వరరావు, విక్రమ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.