Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ పేదరిక నిర్మూలనకు ఐకేపీ వీవోఏల కృషి
- వారిపట్ట కేంద్రం నిర్లక్ష్యం సరికాదు : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్
- సంగారెడ్డిలో ప్రారంభమైన ఐకేపీ వీవోఏల రాష్ట్ర మూడో మహాసభలు
నవతెలంగాణ-సంగారెడ్డి
దేశంలో అంగన్వాడీ, ఆశా వంటి కేంద్ర ప్రభుత్వ స్కీమ్లలో పనిచేస్తూ, గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలకంగా పనిచేస్తున్న ఐకేపీ వీవోఏల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి సరికాదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్ అన్నారు. సంగారెడ్డిలో తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర 3వ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటగా కామ్రేడ్ మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లర్పించి మహాసభ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాజరైన వెంకటేష్ మాట్లాడుతూ.. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన బీజేపీ.. ప్రజలను మోసం చేసిందన్నారు. రెండేండ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భావోద్వేగాలు రెచ్చగొట్టి మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి ఆరాటపడుతున్నదని విమర్శించారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై పరిష్కారం కోసం ఎలాంటి శ్రద్ధ చూపడం లేదన్నారు. 18 ఏండ్ల నుంచి గ్రామాల్లో మహిళాభ్యున్నతి, మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు వీవోఏలు అవగాహన కల్పిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాల విజయవంతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అయినా వారు సెర్ప్ నుంచి చాలీచాలని వేతనాలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రెండు నెలల్లో క్షేత్రస్థాయిలో ఐకేపీ ఉద్యోగులను కదిలించి పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిరచారు. అనంతరం ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్. రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బీరం మల్లేశం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, గుర్తింపు కార్డులిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. జీవో నెంబర్ 58 సవరించాలని, కనీసం వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరారు. రూ.10 లక్షల సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడంతోపాటు ప్రసూతి సెలవులివ్వాలని తెలపారు. ఒకే రకమైన యూనిఫారాలివ్వాలని డిమాండ్ చేశారు. ఐకేపీ వీవోఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతిపత్రం అందజేస్తామని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రానున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు. వీవోఏల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నగేష్, సుధాకర్, నాయకులు రాజకుమార్, శోభారాణి, అనిత, వెంకటయ్య, రమేష్, అరుణ, మౌనిక, ముస్తఫా, కాజా, మల్లయ్య, ఆంజనేయులు, సీఐటీయూ నాయకు యాదగిరి,వివిధ జిల్లాల నుండి వీవోఏలు పాల్గొన్నారు.