Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలి
- తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రథమ మహాసభలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను విస్మరిస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మానగర్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రథమ మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల పనిగంటలు తగ్గించి పనికితగ్గ వేతనాలు పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న పవర్లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారందరినీ ఐక్యం చేస్తూ పోరాటాలను నిర్వహించేందుకు 2018లో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిరిసిల్లలో ఆవిర్భవించిందని తెలిపారు. ధనబలం, పెట్టుబడిదారుల అండదండలతో అధికారంలోకొచ్చిన ప్రధాని మోడీ నయా ఉదారవాద విధానాలతో పాటు హిందుత్వ ఎజెండాను మరింత దూకుడుగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ల లాభాల కోసం భారత కార్మికవర్గం ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పెంచడంతో పాటు మూడేండ్లు కార్మిక చట్టాలను సస్పెండ్ చేస్తూ ఆర్డినెన్స్ల్ను జారీ చేశారని తెలిపారుభారతదేశంలోనే రాష్ట్రాన్ని వస్త్ర నగరిగా తీర్చిదిద్ది, 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇచ్చిన హామీలు అమలుచేయలేదని విమర్శించారు. 2000 ఎకరాల్లో కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తామని, 2014లో వరంగల్‌లో శంకుస్థాపన చేసి నేటికీ తొమ్మిదేండ్లవుతున్నా పార్కు పూర్తి కాలేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్లూమ్ కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని, కనీస వేతనాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.అనంతరం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్లలో అమలు చేసిన వర్కర్స్ టు ఓనర్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కావాల్సిన వస్త్రాలను తెలంగాణలోని పవర్లూమ్ కార్మికులచే ఉత్పత్తి చేయాలన్నారు. పవర్లూమ్ కార్మికునికి ప్రభుత్వ గ్యారంటీతో రూ.5 లక్షల పెట్టుబడి సాయం పవర్లూమ్ కార్పొరేషన్ ద్వారా అందించాలని కోరారు. ఉత్పత్తయిన వస్త్రాలకు మార్కెట్ వసతి కల్పించి వస్త్ర ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులు పాలిస్టర్, కాటన్, రంగులు, రసాయనాల విక్రయకేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముషం రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్, యూనియన్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.