Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టుకోవడం కోసం పోరాడుదాం : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-వైరా టౌన్
కేంద్ర ప్రభుత్వ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరా పట్టణ కేంద్రంలో కమ్మవారి కల్యాణ మండపం (నాగటి నారాయణ ప్రాంగణం)లో జరిగిన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన విద్యా విధానం 2020 రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు పొడిచే విధంగా ఉందని, విద్యా ప్రయివేటీకరణకు పెద్ద పీట వేస్తుందని, చరిత్రను వక్రీకరించి, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేసి కొన్ని వర్గాలకు మాత్రమే లబ్ది చేకూర్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ వైఖరితో దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
చదువు కొనే వారికి మాత్రమే చదువు అందుతుందని, కష్టపడి చదివి ఐఐటీలో సీటు సాధించిన పేద, దళిత, బహుజన వర్గాల విద్యార్థులు పెంచుతున్న ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా, వైద్యం ప్రభుత్వం చేతిలో ఉంటే, మనదేశంలో కార్పొరేట్ల చేతుల్లోకి పోయిందన్నారు. ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించే బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులదేనని, ఉపాధ్యాయుల ఐక్యత కోసం టీఎస్ యూటీఎఫ్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమాలతో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా చైతన్యం చేయాలని సూచించారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఉపాధ్యాయులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభ ప్రారంభానికి ముందు ఉపాధ్యాయులు బస్టాండ్ సెంటర్ మీదుగా భారీ ర్యాలీగా సభా ప్రాంగణం వరకు వెళ్లారు. ర్యాలీలో వివిధ రకాల డిమాండ్లతో కూడిన ప్లే కార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, రాష్ట్ర కార్యదర్శి బండి నరసింహారావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీ నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల నుంచి విచ్చేసిన కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.