Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోట్ల రద్దుతో బ్లాక్‌మనీ వైట్‌గా మార్చారు : టీవీఎస్ రాష్ట్ర సదస్సులో కె నాగేశ్వర్
- నియంతృత్వం పెరిగితే ఫాసిజమే : ఘంటా చక్రపాణి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో భయంకరమైన అసమానతలు పెరిగాయని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన అవసరముందని చెప్పారు. సంపద కేంద్రీకృతమైతే దేశం ఆర్థిక వృద్ధి సాధించినట్టు కాదని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస్ సమితి నిర్వహించిన 'సామాజిక సదస్సు'కు సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 'సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ కారణాలు-ప్రభావాలు' అనే అంశంపై నాగేశ్వర్ మాట్లాడుతూ దేశంలో 22 శాతం సంపద ఒకరి చేతుల్లో కేంద్రీకృతమైందనీ, 50 శాతం జనాభా చేతుల్లో 13 శాతం సంపద ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వృద్ధి 6 శాతం పెరుగుతున్నప్పటికీ అది అసమానతలు పెంచేదిగా ఉందన్నారు. నోట్లను రద్దు చేయడం ద్వారా దేశంలో నల్లధనం బయటికి వస్తుందని నమ్మబలికారని గుర్తు చేశారు. కానీ ఆచరణలో నోట్ల రద్దు నల్లధనాన్ని వైట్ మనీగా మార్చే సాధనంగా మారిందన్నారు. నోట్ల రద్దు అయి ఆరేండ్లు అయినా కూడా నల్లధనం ప్రభుత్వం వద్ద డిపాజిట్ కాలేదని తెలిపారు. దాచుకునేందుకు వీలుగా రెండువేల నోట్లు చెలామణిలోకి తెచ్చిందని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత దేశంలో బోగస్ నోట్లు 10.7 శాతం పెరిగాయని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయాలు విఫలం కావడంతో నగదు రహితమే తమ లక్ష్యంగా చెప్పిందని గుర్తు చేశారు. ప్రపంచ దేశాల్లోనే మన దేశం అధికంగా నగదు ఉపయోగిస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదన్నారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ రాయితీలు ఎక్కువగా ఆశిస్తారనీ, కానీ ఉపాధి కల్పనపై దృష్టి సారించరని చెప్పారు. ఇటీవల ఖరీదైన బంగ్లాకు, విలాసవంతమైన కార్ల కొనుగోలు పెరిగిందనీ, అపార్టుమెంట్లకు, బేసిక్ మోడల్ కార్లకు గిరాకీ లేదన్నారు.
అరాచక పాలనలో తిరుగుబాటుకు స్వేచ్ఛ లేదు :ఘంటా చక్రపాణి
దేశంలో అరాచక పాలన రాజ్యమేలుతున్నదని ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలను నాశనం చేస్తున్నారని చెప్పారు. భారత రాజ్యాంగ విలువలు- ఎదుర్కొంటున్న సవాళ్లు' అనే అంశంపై ఆయన మాట్లాడారు. దేశంలో నియంతృత్వం పెరిగి ఫాసిజం విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్మాదం ఆవహించి దళితులు,మైనార్టీలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. చివరికి న్యాయ స్థానాలు కూడా న్యాయం చేయలేని పరిస్థితి దాపురించిందన్నారు. స్వాములు, సంఘపరివార్ శక్తులకు తప్ప మరెవరికీ స్వేచ్ఛ లేదని చెప్పారు. బ్రిటీష్ ప్రభుత్వానికి వీర సావర్కర్ లొంగిపోయారంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కాగితం చూపితే, ఆయనపై బాంబులేస్తామంటూ మూకలు హెచ్చరిస్తున్నాయని చెప్పారు. గుండాయిజం రాజ్యమేలుతున్నదని చెప్పారు. 277 మంది ఎమ్మెల్యేలను రూ 5,500 కోట్లతో కొనుగోలు చేసిందంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు. గవర్నర్లు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టే అధికారమెవరిచ్చారని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థి, యువజనులు పాల్గొన్నారు.