Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- అంగన్వాడీ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా భారీ ర్యాలీ, బహిరంగసభ
నవతెలంగాణ-భువనగిరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని, ఐసీడీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లాలోని మల్లు స్వరాజ్యం ప్రాంగణం (సోమ రాధాకష్ణ ఫంక్షన్ హాల్)లో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) 4వ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాయగిరిలోని లింగబసవ ఫంక్షన్‌హాల్ నుండి సోమ రాధాకృష్ణ ఫంక్షన్‌హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పద్మ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వరంగ స్కీమ్‌లో పనిచేస్తున్న అంగన్వాడీలను ఐసీడీఎస్ స్కీం వర్కర్స్‌గా చూస్తున్నారని, అలాకాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రభుత్వశాఖగా గుర్తించాలని కోరారు. సుప్రీంకోర్టు, కాగ్ నివేదిక ఐసీడీఎస్‌ను కొనసాగించాలని చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని పెడచెవిన పెట్టి ఐసీడీఎస్‌ను ఎత్తివేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. 1972 గ్రాట్యూటీ చట్టం అంగన్వాడీలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పినా కేంద్ర ప్రభుత్వం మాత్రం అమలు చేయడం లేదన్నారు. అనంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌ను మూసివేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రతో నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చి అంగన్వాడీ సెంటర్లను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పెరుగుతున్న ధరలతో సమానంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్‌కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ప్రభుత్వ శాఖగా గుర్తించి ప్రయివేటీకరణను ఆపాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సభలో సీఐటీయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరిపాండు, జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు బూరుగు స్వప్న, సిలివేరు రమాకుమారి, జిల్లా ఆఫీస్ బేరర్స్ దోనూరి నర్సిరెడ్డి, ఎండీ పాషా, మామిడి వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకత్వం పోతరాజు జహంగీర్, మంచాల మధు, తదితరులు పాల్గొన్నారు.