Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుట్టినరోజు వేడుకల్లోకి బయటి వ్యక్తులు రావడంతో..
- మందలించిన గురుకులం సిబ్బంది
నవ తెలంగాణ- మట్టెవాడ
జ్యోతిరావుపూలే గురుకులం విద్యార్థినులు ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో కలకలం సష్టించింది. పుట్టిన రోజు వేడుకల్లో బయటి వ్యక్తులు గురుకులంలోకి రావడంతో గురుకులం సిబ్బంది వారిన మందలించడంతో మనస్తాపం చెందిన ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారు.
అప్రమత్తమైన సిబ్బంది వెంటనే సదరు విద్యార్థులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఆరేపల్లెలో పూర్వ ఓరుగల్లు విద్యానికేతన్ భవనంలో ఉన్న ములుగు జిల్లా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారు. అక్కడ పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఒక విద్యార్థిది ఆదివారం పుట్టినరోజు కావడంతో ఆ వేడుకలను శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో సిబ్బందికి తెలియకుండా గురుకులం టెర్రస్ పైన జరుపుకోవాలని ప్రయత్నించారు. గమనించిన సెక్యూరిటీ హాస్టల్ వార్డెన్ పైకి వెళ్లి చూడగా అప్పటికే పుట్టినరోజు జరుపుకునే అమ్మాయి అన్నయ్యతో పాటు అతని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండటం గమనించిన సిబ్బంది వారిని గట్టిగా మందలించి బయటికి పంపించారు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపిన సిబ్బంది వారిని హాస్టల్కు రావాలని తెలిపారు. తల్లిదండ్రులు వస్తున్నారనే భయంతో ఐదుగురు విద్యార్థులు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బాత్రూమ్లు క్లీన్ చేసే ఫినాయిల్, అందుబాటులో ఉన్న సానిటైజర్లు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. గమనించిన సిబ్బంది వారిని ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి 24 గంటలు గడిస్తే గాని తెలియదని వైద్యులు సూచించారు.
గురుకులానికి చెందిన వ్యక్తులు కాకుండా బయటి వ్యక్తులు హాస్టల్లోకి రావడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాలు కళ్లుగప్పి ఇలా ఆడపిల్లలు ఉండే చోటికి బయటి వ్యక్తులు ప్రవేశిస్తే తమ పిల్లల రక్షణ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.